అనారోగ్యంతో మృతి..పలువురి సంతాపం
కడసారి చూపునకు తరలివచ్చిన ప్రజానీకం
ఢాకా : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్‌పర్సన్, మాజీ ప్రధాని ఖలీదా జియా (80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఆర్థరైటిస్, కంటికి సంబంధించిన రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలతో అనేక సంవత్సరాలుగా బాధపడుతున్న ఖలీదా ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందారు. ఆమెకు శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చారు. గుండెకు సంబంధించిన సమస్య కారణంగా ఖలీదాకు గతంలో స్టెంట్ వేశారు. ఖలీదా మరణవార్తను బీఎన్‌పీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలియజేసింది. ప్రార్థనల అనంతరం ఉదయం 6 గంటలకు ఆమె కన్నుమూశారని వెల్లడించింది.
ఆమె ఆత్మ శాంతి కోసం ప్రజలంతా ప్రార్థించాలని కోరింది. బ్రిటీష్ ఇండియాలోని అవిభక్త దినాజ్‌పూర్ జిల్లాలో భాగమైన జల్పాయిగురిలో ఖలీదా జియా జన్మించారు. ఆమెకు కుమారుడు తారిక్ రెహ్మాన్, కోడలు జుబైదా రెహ్మాన్, మనుమరాలు జైమా రెహ్మాన్ ఉన్నారు. ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ వచ్చే సంవత్సరం జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం చేస్తానని ఆమె ఇటీవల హామీ ఇచ్చారు. లండన్‌లో ఆధునిక వైద్య చికిత్స పొందిన తర్వాత ఢాకా వచ్చిన ఖలీదా ఎవర్‌కేర్ ఆస్పత్రిలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 17 సంవత్సరాల పాటు స్వీయ ప్రవాస జీవితం గడిపిన అనంతరం ఆమె కుమారుడు తారిక్ రెహ్మాన్ ఇటీవలే స్వదేశానికి చేరుకున్నారు. అయితే బంగ్లాదేశ్ ప్రధానిగా పదవిని చేపట్టిన తొలి మహిళ ఖలీదాయే. 1960లో ఆమె జియావుర్ రెహ్మాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన 1977లో దేశాధ్యక్షుడు అయ్యారు. 1981లో జరిగిన సైనిక కుట్రలో జియావుర్ హత్యకు గురైన తర్వాత క్రియాశీలక రాజకీయాలలోకి ఖలీదా ప్రవేశించారు. 1984లో బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ అయ్యారు. 1991లో ప్రతిపక్షాల విజయానికి ఆమె నేతృత్వం వహించి బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. 1991 నుంచి 1996 వరకూ, 2001 నుంచి 2006 వరకూ ఆమె ప్రధాని పదవిని నిర్వహించారు. అయితే అవినీతి ఆరోపణల కారణంగా ఆమె సుదీర్ఘ కాలం జైలు జీవితం గడపాల్సి వచ్చింది. గత ఏడాదే ఆమె గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు.
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



