తిప్పి కొట్టిన బలగాలు
ఆందోళన కలిగించిందన్న మోడీ, ట్రంప్
మాస్కో, వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఆదివారం రాత్రి దాడి జరిగిందని విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్ తెలిపారు. మాస్కోకు సమీపంలోని నొవొగార్డ్ రీజియన్‌లో ఆయన అధికార నివాసంపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడికి యత్నించారని, మొత్తంగా 91 కమికజె డ్రోన్లు ఉపయోగించారని, వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపారు. కాగా ఈ దాడిని ఉగ్ర దాడిగా పేర్కొంటూ రష్యా ఉన్నతాధికారులు ఖండించారు. ఈ దాడిపై కచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటామని ప్రతిన చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రస్తుతం శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన మాస్కో వైఖరిని ప్రభావితం చేసే అవకాశం వుందని, కచ్చితంగా దీనిపై సమీక్ష వుంటుందని లావ్‌రోవ్ చెప్పారు. చర్చల నుండి బయటకు రాబోమని, అయితే తమ వైఖరిని సమీక్షించుకుంటామని చెప్పారు. అయినా ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన, బాధ్యతారాహిత్య చర్యలకు సమాధానం చెప్పకుండా ఎలా వదిలివేస్తామని ప్రశ్నించారు. ఇది ‘ప్రభుత్వ ఉగ్రవాదం’ కిందకు వస్తుందని చెప్పారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో పుతిన్ ఆ నివాసంలో వున్నారా లేదా అనేది స్పష్టం కాలేదు.
ట్రంప్ ఆగ్రహం
ఈ దాడి గురించి పుతిన్ స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సోమవారం ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలియగానే ట్రంప్ దిగ్భ్రాంతికి గురయ్యారని క్రెమ్లిన్ విదేశాంగ విధాన సహాయకుడు యురి యుష్‌కొవ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడిని ట్రంప్ ఖండించారు. ‘అత్యంత సున్నితమైన సమయంలో జరిగిన ఘటన’ అంటూ ఈ దాడి తనకు తీవ్ర ఆగ్రహాన్ని కలగచేసిందన్నారు.
వైట్‌హౌస్ వెలుపల ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి ట్రంప్ మాట్లాడారు. కాగా ఇదంతా అసత్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
తీవ్రంగా ఆందోళన కలిగించింది : మోడీ
పుతిన్ నివాసంపై దాడి వార్త తమకు తీవ్రంగా ఆందోళన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు శాంతిని నెలకొల్పే దిశగా సుస్థిర బాటను వేస్తున్నాయన్నారు. ఈ దశలో ఈ ప్రయత్నాలపైనే అందరూ దృష్టి పెట్టాల్సి వుందని అన్నారు. అంతేకానీ ఆ శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోరాదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



