Wednesday, December 31, 2025
E-PAPER
Homeక్రైమ్నేరాలు తగ్గారు

నేరాలు తగ్గారు

- Advertisement -

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఎవ్వరినీ వదలం
మావోయిస్టులు నిర్బీతిగా వచ్చి లొంగిపోవచ్చు
పెరిగిన రోడ్డు ప్రమాదాలు… తగ్గిన మరణాల సంఖ్య : రాష్ట్రంలో నేరాలపై డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి వార్షిక నివేదిక విడుదల

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
”రాష్ట్రంలో నేరాల సంఖ్య గతేడాది కంటే 2.33 శాతం తగ్గాయి. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఎవ్వరినీ వదలి పెట్టం. మావోయిస్టులు లొంగిపో వడానికి మా ద్వారాలు తెరిచే ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే రాష్ట్ర పోలీసులు మొదటి స్థానంలో ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి.. కానీ మరణాల సంఖ్య తగ్గింది” అని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 2025 నేరాల వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు.

మాజీ సీఎం పేరెత్తకుండానే శాంతి భద్రతల మాట…
రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రమూ నిజం లేదనీ, శాంతి భద్రతలను బేరీజు వేసే దొమ్మీ కేసులు గతేడాది కంటే గణనీయంగా తగ్గడమే అందుకు నిదర్శనమని డీజీపీ అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు శాంతి యుతంగా ముగియడం కూడా దీనికి ఒక నిదర్శనమని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ పేరెత్తకుండా వ్యాఖ్యానిం చారు. రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహించిన ప్రతిష్టా త్మకమైన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. ముఖ్యంగా గ్లోబల్‌ సమ్మిట్‌, మిస్‌ వరల్డ్‌ పోటీలతోపాటు మరికొన్ని కార్యక్రమాలు రాష్ట్ర పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేశాయని ఆయన చెప్పారు. ముఖ్యమైన పండుగలు, పర్వదినాల సందర్భంగా ఎలాంటి మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా సాగేలా చూశామని వివరించారు.

కేసుల తగ్గుదల 2.33 శాతం
రాష్ట్రంలో గతేడాది 2,34,158 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అది 2.33 శాతం తగ్గి 2,28,695కు చేరుకున్న దనీ, ఇది రాష్ట్ర పోలీసులు సమిష్టిగా నిర్వహించిన విధుల కారణంగానే సాధ్యమైందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 509 మంది మావోయి స్టులు లొంగిపోయారనీ, అందులో 24 మంది మాత్రమే తెలుగువారని ఆయన చెప్పారు. అజ్ఞాతంలో రాష్ట్రానికి చెందిన 53 మంది మావోయిస్టులు ఉన్నారనీ, వారి లొంగుబాటుకు ద్వారాలు తెరిచే ఉంచామని తెలిపారు.

సైబర్‌ రికవరీలో భేష్‌
గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌కు చెందిన భూములను ఆక్రమించుకున్న వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడా నికి హైకోర్టును ఆశ్రయించామని ఒక ప్రశ్నకు డీజీపీ జవాబి చ్చారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో జ్యుడీషియల్‌ పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడలేననీ, అయితే ఈ కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టు లను త్వరలోనే భర్తీ చేస్తామనీ, అందుకు తగిన ప్రక్రియ ప్రభుత్వస్థాయిలో కొనసాగుతున్నదని శివధర్‌రెడ్డి చెప్పారు. సైబర్‌ నేరాలు ఈ ఏడాది కొద్దిమేర పెరిగాయనీ, వారు దోచుకున్న మొత్తం రూ.246.22 కోట్ల నుంచి రూ.159 కోట్లను రికవరీ చేసి 24,498 మంది బాధితులకు అందజేశామని తెలిపారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో నక్కి ఉన్న 371 మంది సైబర్‌ నేరగాళ్లను తమ ప్రత్యేక బృందాలు అరెస్ట్‌ చేశాయన్నారు.

ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీస్‌ అకాడమీలో ఈ ఏడాది 12,555 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్టమైన శిక్షణను ఇచ్చామని డీజీపీ అన్నారు. అందులో 112 మంది డీఎస్పీలు కూడా ఉన్నారని చెప్పారు. పోలీసు శాఖలోని అధికారులు, సిబ్బందికి విద్యార్హతలను పెంచడానికి గానూ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామనీ, దీని ద్వారా 30వేల మంది అధికారులు, సిబ్బందికి విద్యా ర్హతలు పెరగడానికి దోహదపడుతున్నదని ఆయన తెలి పారు. అలాగే పోలీసుల సామర్థ్యం, పనితీరును మరింత పెంచడానికి జేఎన్‌టీయూహెచ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ తో కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ వరదల్లో చిక్కుకున్న 2485 మంది బాధితులను రక్షించామని అన్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాల్లో సైతం బాధితులను రక్షించడంలో రాష్ట్ర పోలీసులు కీలక
పాత్ర వహించారని శివధర్‌రెడ్డి తెలిపారు.

7.9 శాతం తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
జాతీయ స్థాయిలో షామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు ఉత్తమ పీఎస్‌గా అవార్డు లభించిందనీ, అలాగే పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌, చోరీ అయిన ఫోన్‌ల రికవరీ, సైబర్‌ నేరాల కట్టడిలో జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుందని డీజీపీ చెప్పారు. రాష్ట్రంలో నేరస్థులకు గతేడాది కంటే 3.09 శాతం శిక్షల రేటును పెంచగలిగామనీ, వచ్చే ఏడాది ఆ రేటును పెంచడానికి మరింతగా కృషి చేస్తామని అన్నారు. ఈ ఏడాది నలుగురు నేరస్థులకు మరణ శిక్షలను, 320 మంది నేరస్థులకు యావజ్జీవ శిక్షలను న్యాయస్థానాల ద్వారా పొందామనీ, నేరం చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షలు పడేలా చేయడమే తమ లక్ష్యంగా ఎంచుకున్నామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో 28 కేసులకు సంబంధించి 53 మంది నేరస్థులకు యావజ్జీవ శిక్షలు పడేలా చేశామని తెలిపారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను 7.9 శాతం తగ్గించగలిగా మనీ, అయితే గతేడాదితో పోలిస్తే 5.68 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయని చెప్పారు.

పెరిగిన మహిళల హత్యలు, వేధింపులు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు 8.76 శాతం, లైంగికదాడి కేసులు 13.45 శాతం, ఆస్తి కోసం హత్యలు 15.66శాతం, దొమ్మీ కేసులు 42.59 శాతం తగ్గగా.. బందిపోటు దొంగతనాలు 24.14 శాతం, బెదిరించి దొంగతనాలు 0.54 శాతం, దొంగనోట్ల కేసులు వంద శాతం పెరిగాయని ఆయన వివరించారు. ఈ ఏడాది మహిళల హత్యలు 2.90 శాతం, మహిళలపై వేధింపులు 9.02 శాతం, వరకట్న మరణాలు 0.79 శాతం పెరిగాయని తెలిపారు.

పోలీసుల ఆత్మహత్యలపై సీరియస్‌గా దృష్టిసారించాం
బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై కొందరు పోలీసులు ఆత్మ హత్యలు చేసుకోవడంపై సీరియస్‌గా దృష్టిసారించా మనీ, అలాంటి వారి మానసిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ఒక కార్యాచరణను రూపొందించి శాఖాపరంగా అమలు చేస్తు న్నామని ఒక ప్రశ్నకు పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ సమాధానమిచ్చారు. 703 మంది ఎస్‌హెచ్‌ఓలను డీజీపీ పిలిచి వారికి ఈ విషయంలో మార్గదర్శకత్వాన్ని బోధించాలని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఇంటెలి జెన్స్‌ అదనపు డీజీ విజరుకుమార్‌, సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా, ఎస్‌ఐబీ ఐజీ సుమతి, తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం
మాదక పదార్థాల నిరోధంపై రాష్ట్ర ఈగల్‌ టీం ఉక్కుపాదం మోపుతున్నదనీ, గతేడాదితో పోలిస్తే 31 డ్రగ్స్‌ కేసులు పెరిగాయనీ శివధర్‌రెడ్డి అన్నారు. మరోవైపు గతేడాది రూ.139.69 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.172.93 కోట్ల మేర విలువైన మాదకపదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

మహిళల భద్రతపై..
మహిళల భద్రత కోసం రాష్ట్రంలో నడుస్తున్న 34 భరోసా కేంద్రాలకు మరో నాలుగు విభాగాలను తెరిచామనీ, వీటి ద్వారా 3558 కేసులను దర్యాప్తు చేసినట్టు డీజీపీ తెలిపారు. అలాగే పోక్సోకు సంబంధించి 2579 కేసులు, లైంగికదాడులకు సంబంధించి 819 కేసులు దర్యాప్తు చేశామనీ, 81 కేసులలో నేరస్థులకు శిక్షలు సాధించామని శివధర్‌రెడ్డి వివరించారు. అనాథ పిల్లల భద్రతపై పని చేసిన ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ 12,396 మంది పిల్లలను రక్షించిందని తెలిపారు. ఎన్నారై భర్తల హింసకు సంబంధించి 72 పిటిషన్లు రాగా అందులో 37 పరిష్కారమయ్యాయనీ, 33 కేసుల్లో లుకౌట్‌ నోటీసులను నిందితుల కోసం జారీ చేశామని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రత కోసం 86 బృందాలు పని చేస్తున్నాయనీ, వీటి ద్వారా 10,36,378 మంది మహిళలను చైతన్యపర్చినట్టు తెలిపారు. ఈ ఏడాది 481 హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసులను నమోదు చేసి, 1277 మంది నిందితులను అరెస్ట్‌ చేసి.. 929 మంది బాధితులను రక్షించామన్నారు. 23,315 మిస్సింగ్‌ కేసులు నమోదు కాగా.. 78 శాతం తప్పిపోయినవారి ఆచూకీ కనిపెట్టి బంధువులకు అప్పజెప్పామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -