– ఇజ్రాయిల్‌ను నియంత్రించలేకపోతున్న అంతర్జాతీయ సంస్థలు
– వైమానిక దాడులు.. ఆహారం అందకుండా నెతన్యాహు ఆంక్షలు
– చేతులెత్తేసిన ట్రంప్
రమల్లా : పాలస్తీనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆ దేశంపై ఇజ్రాయిల్ దాష్టీకం పెరిగిపోతోంది. అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయిల్‌ను కట్టడి చేయలేకపోతున్నాయి. పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపానంటూ ప్రచారం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చేతులెత్తేశారు. దీంతో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అంతులేని అరాచకానికి పాల్పడుతున్నారంటూ అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. పాలస్తీనా మీదకు ఇజ్రాయిల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఆర్థికమంత్రి నిర్థారణ
పాలస్తీనా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్-అమౌర్ పాలస్తీనా పరిశ్రమల పరిస్థితిని అంచనా వేసేందుకు బెత్లెహోమ్ పారిశ్రామిక జోన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇజ్రాయిల్ అధికారులు పాలస్తీనా క్లియరెన్స్ ఆదాయాల నుంచి సుమారు 4.5 బిలియన్ డాలర్లను నిలిపేస్తున్నారనీ, దీనివల్ల పాలస్తీనా అథారిటీ (పీఏ) పని చేసే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ”నవంబర్ 2025 చివరి నాటికి మొత్తం పేరుకుపోయిన ప్రభుత్వ అప్పు 14.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2024 స్థూల దేశీయోత్పత్తిలో 106 శాతానికి సమానం” అని ఆర్థికమంత్రి చెప్పారు. ఈ అప్పులో అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెల్లించాల్సిన 4.5 బిలియన్ డాలర్లు, పాలస్తీనా బ్యాంకింగ్ రంగానికి 3.4 బిలియన్ డాలర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల బకాయిల రూపంలో 2.5 బిలియన్ డాలర్ల్లు, ప్రయివేట్ రంగానికి చెల్లించాల్సిన 1.6 బిలియన్ డాలర్ల్లు, బాహ్య అప్పుల రూపంలో 1.4 బిలియన్ డాలర్లు, ఇతర ఆర్థిక బాధ్యతల రూపంలో 1.2 బిలియన్ డాలర్లు ఉన్నా యని ఆయన వివరణ ఇచ్చారు. ఆర్థికపరమైన ఈ ఒత్తిళ్లు ప్రభుత్వ బడ్జెట్ పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయని ఆందోళన వ్యక్తం చేశారు.
22 ఏండ్ల తిరోగమనంలో..
2023తో పోలిస్తే 2025 రెండవ త్రైమాసికంలో పాలస్తీనా జీడీపీ 29 శాతం తగ్గింది. తలసరి జీడీపీ 32 శాతం తగ్గింది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను 22 ఏండ్ల నాటి తిరోగమన స్థాయికి చేర్చింది. అయితే ఆ దేశ ఆర్థికమంత్రి అల్-అమౌర్ మాటల్లో..సామాజిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, వెస్ట్ బ్యాంక్ ఏరియాలో పౌరులకు మద్దతు ఇవ్వడం, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఉత్పాదక రంగాలకు, ముఖ్యంగా పరిశ్రమ, వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం వంటి చర్యల శ్రేణిని ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పుకొచ్చారు.
అన్ని రంగాలపై ప్రభావం
పాలస్తీనాలో నిర్మాణరంగం 41 శాతం కుదించబడింది. పరిశ్రమ, వ్యవసాయం రెండూ ఒక్కొక్కటి 29 శాతం తగ్గాయి. టోకు, రిటైల్ వ్యాపారం 24 శాతం పడిపోయాయి. పర్యాటక రంగం అత్యంత దెబ్బతిన్న వాటిలో ఒకటి. 2023 అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయిల్ జాతి విధ్వంస యుద్ధం ప్రారంభమైన తర్వాత, పర్యాటక మంత్రిత్వ శాఖ రోజువారీ నష్టాలు 2 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఇన్‌బౌండ్ టూరిజం పూర్తిగా కుప్పకూలింది. 2024 చివరి నాటికి, సంచిత నష్టాలు సుమారు 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
పాలస్తీనియన్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎంఏఎస్) నివేదిక ప్రకారం 2024 మొదటి అర్ధభాగంలో వెస్ట్ బ్యాంక్‌లో హౌటల్ ఆక్యుపెన్సీ గత సంవత్సరంతో పోలిస్తే 84.2 శాతం తగ్గుదల కనిపించింది. వసతి, ఆహార సేవల్లో నష్టాలు దాదాపు 326 మిలియన్ డాలర్లు ఉన్నాయని పేర్కొంది.
తిరోగమనంలో ఆర్థిక వ్యవస్థ
పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తిరోగమనం లోకి మారింది. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అక్కడి ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. అధికారిక డేటా ప్రకారం ఆర్థిక వ్యవస్థ కీలకమైన పరిమితికి చేరుకుంటున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాలస్తీనా ఎకనామిక్ మానిటర్‌లో ప్రచురించ బడిన పాలస్తీనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీసీబీఎస్), పాలస్తీనా ద్రవ్య అథారిటీ (పీఎంఏ) సంయుక్త నివేదిక ప్రకారం ఏడాది పొడవునా తీవ్ర మాంద్యంలో చిక్కుకున్నట్టు గుర్తించింది. ఆ నివేదికల ప్రకారం 2023తో పోలిస్తే 2025లో గాజాలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 84 శాతం కుదించ బడింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో జీడీపీ 13 శాతం తగ్గింది. మొత్తం జీడీపీ స్థాయిల్ని పరిశీ లిస్తే, యుద్ధానికి ముందు వాటి బేస్‌లైన్ కంటే చాలా తక్కు వగా ఉన్నాయి. 2025లో గాజాలో నిరుద్యోగం 77 శాతానికి పైగా పెరిగింది.
నిలబడేందుకే యత్నం
ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పాలస్తీనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయివేట్ రంగాన్ని నిలబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది. ఏడు కీలక రంగాల్లో ఇజ్రాయిల్ దిగుమతులను ప్రత్యామ్నాయంగా మార్చడం, డిజిటల్, గ్రీన్ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఇంత సంక్షోభంలోనూ ఏటా దాదాపు 2,500 కొత్త కంపెనీలు నమోదవు తున్నాయని ఆ దేశ ఆర్థిక మంత్రి చెప్పారు.
కుప్ప కూలిన పర్యాటకం
పాలస్తీనాలో పదేపదే సంక్షోభాలు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయని అల్-కుడ్స్ విశ్వవిద్యాలయ లెక్చరర్, పాలస్తీనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ బోర్డు సభ్యుడు సమీర్ హజ్బున్ తెలిపారు. గడచిన ఐదేండ్లుగా కోవిడ్-19 మహమ్మారితో ప్రారంభమైన గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం తరువాత అన్ని రంగాలు వరుస సంక్షోభాల్లోకి నెట్టబడ్డాయని విశ్లేషించారు. అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటైన పర్యాటకం ముఖ్యంగా ప్రభావితమైందన్నారు.
హౌటళ్ళు, సావనీర్ దుకాణాలు, ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ గైడ్‌లు, వీధి విక్రేతలు స్తంభించిపోవడం వల్ల పర్యాటకం 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ప్రత్యక్ష నష్టాలను చవిచూసిందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయని హజ్బున్ అన్నారు. ”హౌటల్ పెట్టుబడులు మాత్రమే 550 మిలియన్ల డాలర్లుగా అంచనా వేశారు. యజమానులకు ఆర్థిక రాబడి లేదు. ఉద్యోగ భద్రత, ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో చాలా మంది కార్మికులు ఈ రంగాన్ని వదలుకోక తప్పటంలేదు” అని విశ్లేషించారు.
అది సంక్షోభం కాదు
క్లియరెన్స్ ఆదాయాల నిలుపుదల తాత్కాలిక ఆర్థిక సంక్షోభం కాదని పాలస్తీనా వ్యవహారాలను అంతర్జాతీయ మీడియాలో ప్రసారం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికరంగ నిపుణులు మహ్మద్ దరాగ్మెV్‌ా అభిప్రాయపడ్డారు. పాలస్తీనా రుణాన్ని బ్యాంకులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లు, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్య రంగాలకు చెల్లించాల్సిన నెలవారీ సంచిత రుణాలేనని స్పష్టం చేశారు. అయితే పెట్టుబడి లేదా ఆర్థిక ఉద్దీపనకు నిజమైన సామర్థ్యం లేకుండా ప్రభుత్వం ఏటీఎంలా పనిచేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. జీతాలు చెల్లించడం, బాధ్యతలను నెరవేర్చడంలో నిరంతర వైఫల్యం సమగ్ర ఆర్థిక పతనానికి దారితీస్తుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు హెచ్చరిస్తున్నాయని ఆర్థికరంగ నిపుణులు దరాగ్మెV్‌ా అన్నారు. ఫ్రాన్స్, సౌదీ అరేబియాతో సహా కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నామని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో ఏవీ కార్యరూపంలోకి రాలేదని చెప్పారు.
ఆర్థిక సంక్షోభంలో పాలస్తీనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



