అన్నదాతల ఉద్యమానికి
తలొగ్గిన బీజేపీ సర్కార్
రైతులకు మద్దతు తెలిపిన ఎస్కేఎం
రైతులకు మద్దతు తెలిపిన ఎస్కేఎం
జైపూర్ : రైతుల ఆందోళనల కారణంగా రాజస్థాన్‌లోని హను మాన్‌ఘర్ జిల్లాలోని రాథిఖెరా గ్రామంలో నెలకొల్పతలపెట్టిన ఇథనాల్ ప్లాంట్ ప్రాజెక్టును మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల సాగు భూమి, భూగర్భ జలాలు కలుషిత మవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. దీనికి సంయుక్త కిసాన్‌మోర్చా (ఎస్కేఎం) మద్దతు కూడా తెలిపింది. రాజస్థాన్‌లోని బీజేపీ సర్కార్ రైతులు చేపట్టిన ఆందోళనలను అణచివేయాలని ప్రయత్నించింది. అయినా అన్నదాతలు వెనక్కి తగ్గలేదు. కొన్నిసార్లు ఈ నిరసనలను హింసాత్మకంగా మార్చేందుకు సైతం సర్కార్ యత్నించింది. చివరికి ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో రాజస్థాన్‌లో చేపడుతున్న ప్లాంట్ పనులను నిలిపివేసి మధ్యప్రదేశ్‌కు తరలించేందుకు కంపెనీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన లాంఛనప్రాయ చర్యలు పూర్తైన తర్వాత ఇక హనుమాన్‌ఘర్ జిల్లాలో కంపెనీ తన కార్యకలాపాలకు స్వస్తి పలుకనుంది. చండీగఢ్‌కు చెందిన ప్రయి వేటు కంపెనీ డూనె ఇథనాల్ ప్రయివేట్ లిమిటెడ్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2023లో అశోక్‌గెహ్లాట్ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అయితే దానికి ఈ ఏడాది డిసెంబరులో సమస్యలు మొదలయ్యాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ కార్య కలాపాలు కొనసాగించడం సాధ్యం కాక పోవడంతో తరలింపునకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 40 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టు 1320 కెఎల్‌పీడీ ధాన్యం ఆధారిత ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంది. దీంతో పాటు 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానికంగా దొరికే బియ్యం, జొన్నలు, గడ్డి వంటి వాటిని ఉపయోగించుకోవాలని ఈ కంపెనీ భావించింది.
రాజస్థాన్ ఇథనాల్ ప్లాంట్ తరలింపు
- Advertisement -
- Advertisement -


