అమెరికాలో ప్రయాణాలంటే భయం…భయం
ప్రతి పది మందిలో ముగ్గురి పరిస్థితి ఇదే
వాషింగ్టన్ : అమెరికాకు వలసలను పరిమితం చేసేందుకు హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు సహా ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుండడంతో అనేక మంది వలసదారులు ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. విదేశీ ప్రయాణాలకు వారు ఏ మాత్రం సుముఖత చూపడం లేదు. వలసదారులే కాదు…అమెరికా పౌరులు సైతం దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అవసరమైన పత్రాలు చేతిలో ఉన్నప్పటికీ వారు విదేశీ ప్రయాణమంటేనే జంకుతున్నారని కేఎఫ్‌ఎఫ్-ఎన్‌వైటీ సర్వే తెలిపింది. వలసదారులలో 27 శాతం మంది…అంటే ప్రతి పది మందిలో ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే దేశంలోనూ, విదేశాలకు ప్రయాణాలను మానుకుంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నిఘానేత్రానికి ఎక్కడ చిక్కుతామోనని వారు భయపడుతున్నారు. హెచ్-1బీ వీసాలు ఉన్న వారిలో 32 శాతం మంది, పౌరుల్లో 15 శాతం మంది ప్రయాణాలను నివారిస్తున్నారని సర్వే చెబుతోంది.సరైన పత్రాలు లేని వలసదారులలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. వీరిలో మూడింట రెండు వంతులు లేదా 63 శాతం మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు మానుకుంటున్నారు. అమెరికాలో వార్షిక సెలవుల సీజన్‌లో ఇప్పటికే సగం పూర్తయింది. ఈ సీజన్‌లో సాధారణంగా అమెరికాలో ప్రయాణాలు అధికంగా జరుగుతుంటాయి. లక్షలాది అమెరికన్లు రోడ్డు, గగనతల మార్గాలలో ప్రయాణిస్తుంటారు. అలాంటి సీజన్‌లో సైతం ప్రయాణాలు పెద్దగా జరగకపోవడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడడం ఎందుకనే భావనలో వలసదారులు ప్రయాణాలకు సిద్ధపడడం లేదని సర్వే తెలిపింది. అదీకాక దేశీయ విమానాలపై అధికారులు దృష్టి సారించడం ఇదే మొదటిసారి. సాధారణంగా డిసెంబర్ వరకూ వారు వాటి జోలికి పోరు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వలసదారుల అరెస్ట్, నిర్బంధం, అప్పగింతకు వీలుగా ప్రభుత్వ సంస్థలన్నీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం వీలు కల్పించింది. భారత్ వంటి దేశాలకు వెళ్లి తిరిగి అమెరికా చేరుకోవాలనుకునే హోచ్-1బీ నిపుణులపై అధికారులు తనిఖీలు పెంచారు. వారి వీసా అపాయింట్‌మెంట్లు కూడా ఆలస్యమవుతున్నాయి. వలసదారులు ప్రయాణాలు మానుకోవడానికి ఇది కూడా కారణమేనని సర్వే చెబుతోంది.



