Wednesday, December 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమానవతా సాయంలో అమెరికా కోతలు

మానవతా సాయంలో అమెరికా కోతలు

- Advertisement -

– ఐరాస సంస్థలకు హెచ్చరికలు
– అదే బాటలో పశ్చిమ దేశాలు
వాషింగ్టన్‌ :
విదేశీ సాయానికి కోత పెడుతున్న అమెరికా… ఐక్యరాజ్యసమితి సంస్థలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ‘స్వీకరించండి… తగ్గించు కోండి లేదా చావండి’ అంటూ ఆయా సంస్థలకు స్పష్టం చేసింది. ఐరాస మానవతా సాయానికి రెండు బిలియన్‌ డాలర్ల సాయం అందిస్తానని హామీ ఇచ్చింది. గత సంవత్సరాలలో అమెరికా అందించిన సాయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ స్వల్ప మొత్తం ఆపన్నులను భయపెడుతుంది. కార్యక్రమాలు, సేవల్లో కోతకు దారితీస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఐరాస మద్దతున్న కార్యక్రమాలకు సంప్రదాయపరమైన అమెరికా మానవతా సాయం ఏటా 17 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంది. ఇందులో 8-10 బిలియన్‌ డాలర్లు స్వచ్ఛంద విరాళాలే. తన ఐరాస సభ్యత్వానికి సంబంధించిన వార్షిక బకాయిల నిమిత్తం అనేక బిలియన్‌ డాలర్లు కూడా అమెరికా చెల్లిస్తోంది. ఏదేమైనా పశ్చిమ దేశాల సాయంలో కోత విధిస్తుండడంతో లక్షలాది మంది ఆకలి, వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంది. అమెరికా తన మానవతా సాయంలో కోత విధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే విదేశీ సాయాన్ని బిలియన్ల కొద్దీ తగ్గించింది. దీంతో ప్రభుత్వ సంస్థలు ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోంది. ప్రాజెక్టుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. వేలాది ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.
అమెరికా మాత్రమే కాదు…బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ కూడా విదేశీ సాయాన్ని కుదించుకున్నాయి. ముఖ్యంగా అమెరికా సాయం తగ్గిపోవడంతో ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌, ది వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం, శరణార్థుల సంస్థ యూఎన్‌హెచ్‌సీఆర్‌ వంటి ఐరాస అనుబంధ సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -