– 54 లక్షల ఎకరాలకు సాగునీరందించాలి
– రెండేండ్ల వ్యవధిలో భారీ ప్రాజెక్టులను పూర్తిచేయాలి : సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగు నీటి భారీ, మధ్యతరహా, మైనర్ ప్రాజెక్టులను పూర్తిచేయాలనీ, 54 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రెండేండ్ల వ్యవధిలో భారీ ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్యపద్మ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో రిటైర్డ్ ఇంజినీర్ కె.విఠల్‌రావు, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సాగునీటి పారుదల రంగ నిపుణులు సాంబశివరావు, ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, భిక్షపతి, జక్కుల వెకంటయ్య, పటోళ్ల నాగిరెడ్డి, విజరు ప్రసంగించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 24 భారీ, ఏడు మధ్యతరహా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు ఎత్తిపోతల, బీమా ఎత్తిపోతల ఫెజ్ 1,2, కోయిల్ సాగర్ ఎత్తిపోతల, ఎస్ ఎల్ బి సి, డిండీ ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన నీటివాటాను సాధించుకుని వాటిని త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణాజిల్లా వివాదాన్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో పియర్స్ కృంగిపోవడానికి కారణాలను తెలుసుకోవడం కోసం భూగర్భ సంబంధిత పరీక్షలు, ఇతరత్రా పరీక్షలు చేయాలనీ, ఆ పరీక్షలలో తేలిన విషయాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనీ, జాతీయ డ్యాం భద్రత అథారిటీ చేసిన సూచనల మేరకు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై డిపిఆర్ ను ప్రకటించాలనీ, తక్కువ ఖర్చుతో కాగు రిపోర్టు ప్రకారం గోదావరి జిలాలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 637 ఎత్తిపోతల పథకాలు ఉండగా అందులో 385 మాత్రమే పని చేస్తున్నాయనీ, కొత్తగా నెలికల్, కేశవాపురం (నల్లగొండ జిల్లా) పిఫ్రీ(నిర్మల్ జిల్లా) మూడు కొత్త లిఫ్టు పథకాలకు, నిర్మాణంలో ఉన్న మరో 37 ఎత్తిపోతల పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ 835 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచుతూ జీవో 69/1996 అమలు చేయాలని కోరారు. తుమ్మిడి హెట్టి వద్ద బరాజ్ నిర్మించి అదిలాబాద్, కాళేశ్వరం ఆయకట్టుకు నీరిచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. బోరేపల్లి వరాజనం కూడా కలిపి విశ్లేషించి మెరుగైన పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. హైదరాబాద్ నగరానికి తాగు నీటిని అందించేందుకు ప్రతిపాదించిన కేశవాపూర్, నల్లగొండలో ప్రతిపాదించిన 8 జలాశయాలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. మరో నిజాం సాగర్‌గా మల్లన్నసాగర్ మారకుండా చూడాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో అతి తక్కువ సాగునీటి వసతి ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రధానమైనదిగా భావించి పనులు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, కౌలు రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభు లింగం, కొల్లూరి రాజయ్య, నెట్టెం నారాయణ, రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శి డి.జి. నరేంద్ర ప్రసాద్, మాధవరెడ్డి సుధాకర్ గౌడ్, అల్వాల్ రెడ్డి సిహెచ్ దశరథ, నిమ్మల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
సాగు, తాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



