– రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ
నవతెలంగాణ – మిర్యాలగూడ : మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి ధీరవత్ సైదా నాయక్ మండలంలోని పలు ఎరువుల దుకాణాలను సందర్శించి, రైతుల నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పై వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభంగా, పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. గతంలో లాగా క్యూలైన్లలో నిలబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే బుకింగ్ చేసి, తామెంచుకున్న దుకాణంలో సులభంగా యూరియా పొందుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు తమ అనుభవాలను వీడియోల ద్వారా కూడా పంచుకున్నారు. 0 నుండి 1 ఎకరం వరకు ఉన్న రైతులకు ఒక దఫా, 2 నుండి 5 ఎకరాల వరకు ఉన్న వారికి రెండు దఫాలు,5 ఎకరాల పైబడిన వారికి మూడు దఫాలుగా యాప్ ద్వారా యూరియా సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
యాప్ వినియోగంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా, సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ యాప్ పూర్తిగా రైతుల ప్రయోజనార్ధమే ప్రవేశపెట్టినదని పేర్కొన్నారు. అందువల్ల రైతులు యాప్‌ను విశ్వాసంతో వినియోగించి లాభపడాలని కోరారు వారి వెంట మండల వ్యవసాయ విస్తరణ అధికారులు షఫీ, మాలవత్ రమేష్ నాయక్ రైతులు పాల్గొన్నారు.



