– యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్న పట్టించుకోని అన్నదాతలు
– రంగంలోకి మహిళ అన్నదాతలు
– ముష్టికుంట్ల సొసైటీ వద్ద మహిళా అన్నదాతలదే రాజ్యం
– యూరియా కొరత లేదు – ఆందోళన చెందవద్దు
– మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే బోనకల్లు మండలంలో యూరియా కోసం రైతుల పడుతున్న అగసాట్లు అంతా ఇంతా కాదు. బోనకల్లు మండలంలో యూరియా కొరత లేదని ఒకవైపు మండల వ్యవసాయ శాఖ అధికారులు పదేపదే చెబుతున్న అన్నదాతల మాత్రం యూరియా కోసం పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. అయితే కొంతమంది రైతులు పెద్ద మొత్తంలో యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బోనకల్ మండలంలో మొత్తం తొమ్మిది సహకార సంఘాల నుంచి అన్నదాతలకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియాను సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా రావినూతల ఓ ప్రైవేటు షాపు నుంచి కూడా ఆ యజమాని యూరియాను రైతులకు అందిస్తున్నారు. బోనకల్ మండల వ్యాప్తంగా యాసంగిలో 15,836 ఎకరాలలో అన్నదాతలం మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రస్తుతానికి ఒక్కొక్క ఎకరానికి ఒక్క యూరియా బస్తా సరిపోతుందని మండల వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.
ఈ లెక్కన 15,836 ఎకరాలకు గాను ప్రస్తుతం 15,836 యూరియా కట్టలు సరిపోతాయి. మొక్కజొన్న విత్తనం విత్తిన వెంటనే 1/3 వంతు మాత్రమే యూరియా వేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా 96 కేజీల నత్రజని మొక్కజొన్న పంటకు అందుతుందన్నారు. రెండవ దశలో విత్తనం విత్తిన 30 నుంచి 35 రోజులలో మరో 2/3 వంతు యూరియా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మూడవ దశలో 50 నుంచి 55 రోజుల తర్వాత మిగిలిన 1/3 వంతు యూరియా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేయటం వలన మొక్కజొన్న పంట ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తాము చెప్పిన సూచనలు ఏమి అన్నదాతలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా యూరియా వేస్తున్నారని దీనివలన పంటకు ఉపయోగం ఏమీ లేదని చెప్తున్నారు. పద్ధతి ప్రకారం యూరియాను వినియోగించడం వల్లనే మొక్కజొన్న పంట దిగుబడి అధికంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. యూరియాను అధికంగా వాడటం వలన పంటకు నష్టమేనని అధికారులు చెబుతున్నారు.
ప్రధానంగా ముష్టికుంట్ల, బోనకల్, రావినూతల, లక్ష్మీపురం, పెద్ద బీరవల్లి, నారాయణపురం, బ్రాహ్మణపల్లి, కలకోట, మోటమర్రి సహకార సంఘాల నుంచి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియాను అందిస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పంటకు ఎకరానికి ఒక కట్ట అవసరం ఉంది. అయితే కొన్ని గ్రామాలలో అన్నదాతలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వస్తాయో రావోనని ఎక్కువ మోతాదులో యూరియా బస్తాల కోసం సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తూ కొనుగోలు చేస్తున్నారు. ముష్టికుంట్ల సొసైటీ వద్ద గత ఐదారు రోజులుగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం మహిళా అన్నదాతలను రంగంలోకి దింపుతున్నారు. ముష్టికుంట సహకార సంఘాల పరిధిలో చొప్పకట్లపాలెం గ్రామం కూడా ఉంది. ఈ రెండు గ్రామాలకు అవసరమైన యూరియా ముష్టికుంట సొసైటీలో ఉంది అని సొసైటీ అధికారులు చెబుతున్నారు. అయినా అన్నదాతలు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీ కార్యాలయము వద్ద క్యూ కడుతున్నారు.
గత మూడు రోజులుగా ఘర్షణలు జరుగుతుండటంతో బుధవారం మండల తాసిల్దార్ మద్దెల రమాదేవి, ఎస్సై పొదిలి వెంకన్న దగ్గర ఉండే కూపన్లు ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయినా రైతులు యూరియా కోసం ఎగబడటం మానుకోలేదు. పోలీసులు దగ్గరుండి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రమాదేవి మాట్లాడుతూ మండల రైతులకు పూర్తిస్థాయిలో యూరియా పంపిణీ చేస్తామని రైతుల ఎవరు ఆందోళన చెందవద్దని పదే పదే కోరారు. మండలంలో అన్ని సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన యూరియాను వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. యూరియా దొరకదని అపోహతో రైతులు ఆందోళన చెందుతున్నారని అటువంటి పరిస్థితి బోనకల్ మండలంలో లేదన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా మండల అన్నదాతలకు అవసరమైన యూరియాను కచ్చితంగా సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు. యూరియా కోసం బోనకల్ సొసైటీ పరిధిలోనే చిరునోముల గోడౌన్ వద్ద అన్నదాతలో యూరియా కోసం ఎగబడ్డారు.
అదేవిధంగా మండల కేంద్రంలో గల మన గ్రోమోర్ వద్ద కూడా రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. యూరియా కొరత లేదని ఒకవేళ చెబుతున్న అన్నదాతల మాత్రం యూరియా కోసం ఎగబడటం విశేషం. ఇది ఇలా ఉండగా మరి కొంతమంది రైతులు యూరియాను అధికంగా కొనుగోలు చేసి తమ బంధువులకు పంపిస్తున్నారని ఆరోపణలు కూడా బలంగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. యూరియా కోసం అన్నదాతలు ఎగబడటానికి కూడా ఒక కారణం చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారానే యూరియాను రైతులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేయటంతో అనేకమంది అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడటమే తమకు తెలియదని అలాంటప్పుడు స్మార్ట్ ఫోన్ లో యాప్ ద్వారా యూరియా కోసం తాము ఎలా నమోదు చేసుకోవాలని అన్నదాతల ప్రశ్నిస్తున్నారు. యాప్ అనే విధానాన్ని పూర్తిగా తొలగించాలని మ్యన్యువల్ ద్వారానే తమకు యూరియా సరఫరా చేయాలని మండల అన్నదాతల ముక్తకంఠంతో కోరుతున్నారు. అయితే ఈ క్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు అనుసరిస్తున్న వైఖరి కూడా అన్నదాతలలో గందరగోలన నెలకొని ఉంది.
యాప్ ద్వారానే రైతులకు యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయటంతో ఈ యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో యాప్ లో నమోదు చేసుకున్న అన్నదాతలు తమకు యూరియా ఇవ్వాలని ప్రైవేటు పురుగుమందుల షాపు వద్దకు వెళ్లి నిలదీస్తున్నారు. యాప్ పనిచేయటం లేదని ప్రైవేటు పురుగుమందుల షాప్ యజమానులు రైతులకు చెబుతున్నారు. అయితే అందుకు రైతులు అంగీకరించటం లేదు. యాప్ ద్వారా నమోదు చేసుకున్న తర్వాత ఎందుకు ఎవరని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో యాప్ ద్వారా నమోదు చేసుకున్న కొంతమంది రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రైతులకు యూరియా ఎందుకు ఇవ్వటం లేదంటూ ఓ ప్రైవేటు షాప్ యజమానిపై వ్యవసాయ శాఖ అధికారులు కేసు నమోదు చేసిన విషయం సంచలనంగా మారింది. ఒకవైపు యాప్ ద్వారా మాత్రమే యూరియా ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతూనే మరొకవైపు మ్యానువల్ ప్రకారం ఇవ్వాలని అదే వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వటం సంచలనంగా మారింది. వ్యవసాయ శాఖ అధికారులే ఓ స్పష్టమైన ఆదేశాలు పాటించలేని పరిస్థితి యూరియా సరఫరా లో ఏర్పడిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ద్వంద నిబంధనలు పాటించటం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాప్ అనే విధానాన్ని పూర్తిగా తొలగించి ఎప్పటిలాగే మాన్యువల్ ప్రకారం యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.



