Thursday, January 1, 2026
E-PAPER
Homeఖమ్మంఅంతర్జాతీయ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకం

అంతర్జాతీయ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకం

- Advertisement -

– అద్భుత ప్రతిభ కనబర్చిన చిరునోముల గ్రామ యువతి చాపలమడుగు శశికళ
నవతెలంగాణ – బోనకల్

 ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మండల పరిధిలోనే చిరునోముల క్రాస్ రోడ్డు కు చెందిన చాపలమడుగు శశికళ అంతర్జాతీయ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరపున పాల్గొని బంగారు పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోటీల్లో ఆమె అద్భుత ప్రతిభను కనబరిచి భారత్‌కు ఘనవిజయం అందించారు. 9వ తరగతి నుంచే బాల్ బాడ్మింటన్ క్రీడలో శిక్షణ పొందుతున్న శశికళ, చదువులతో పాటు క్రీడను సమన్వయం చేస్తూ ముందుకు సాగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం తరపున 9 జాతీయ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. తన విజయంపై శశికళ మాట్లాడుతూ నా తల్లిదండ్రులు చాపలమడుగు జగదీష్, చాపలమడుగు ఉమ ప్రోత్సాహం, నా కోచ్ అమరేశి లింగయ్య శిక్షణ, అలాగే మా అసోసియేషన్ సెక్రటరీ బొంతు శ్రీనివాస్ రావు మార్గదర్శకత వల్లనే నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపింది.     

ఇన్నేళ్లుగా భారత జట్టులో ఆడాలనే కల ఇప్పుడు నెరవేరిందని, అంతర్జాతీయ వేదికపై భారత్‌కు బంగారు పతకం తీసుకురావడం నాకు అపారమైన గర్వంగా ఉందని, ఈ విజయం భారతదేశ ప్రజలందరికీ అంకితమని తెలిపారు.శశికళ సాధించిన ఈ ఘనవిజయంతో చిరునోముల గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. చిరునోముల గ్రామ సర్పంచ్ అనుమోలు చంద్రకళ, ఉప సర్పంచ్ నిమ్మతోట రఘు, మాజీ ఎంపీటీసీలు నిమ్మ తోట ఖాన, నీలకంఠం శ్రీలత, మాజీ ఉప సర్పంచ్ నీలకంఠం రాము, కోచ్ అమరేసి లింగయ్య, గ్రామపంచాయతీ పాలక వర్గ సభ్యులు, పలువురు క్రీడాకారులు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించడం యువతకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో కూడా శశికళ భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని వారు ఆకాంక్షను వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -