మూడేండ్ల నాటి కేసులో నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టిన కోర్టు
రాంచి : ఎలుకలు 200కిలోల గంజాయిని తినేసిన కారణంగా మూడేండ్ల నాటి డ్రగ్స్ కేసులో నిందితుడిని రాంచి కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. రాంచి నుండి రామ్‌గడ్‌కు మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయన్న సమాచారం అందడంతో 2022 జనవరి 17న రాంచి పోలీసులు ఒక వాహనాన్ని అడ్డుకుని దాన్నుండి గణనీయమైన మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లో ఆ మాదకద్రవ్యాలను కోర్టు ముందు హాజరుపరచాల్సి వచ్చేప్పటికి తాము నిల్వ చేసిన ప్రాంతంలో ఎలుకలు 200కిలోల గంజాయిని తినేశాయని దర్యాప్తు అధికారులు చెప్పారు. దర్యాప్తులో అనేక లోపాలు, లొసుగులు వుండడంతో పాటూ గంజాయిని ఎలుకలు తినేశాయంటూ దర్యాప్తు అధికారి చెప్పడాన్ని రాంచిలోని ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు ఎత్తిచూపుతూ ఇందుకు సంబంధించిన ఏకైక నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టింది. ఆనాడు కారులో వున్న ముగ్గురు దూకి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిలో ఒకరైన ఇందర్‌జిత్ రాయ్ ను పట్టుకున్నారు.
మరో ఇద్దరు పారిపోయారు. అప్పటి నుంచి కస్టడీలోనే వున్న ఇందర్‌జిత్‌ను కూడా తాజాగా నిర్దోషిగా పేర్కొంటూ విడిచిపెట్టారు. ఆ వ్యక్తిపై వున్న అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ఇందర్‌జిత్‌ను విడిచిపెడుతున్నట్లు అదనపుపు జ్యుడీషియల్ కమిషనర్ ఆనంద్‌ప్రకాశ్ డిసెంబరు 19నాటి తీర్పులో పేర్కొన్నారు. మాదకద్రవ్యాల స్వాధీనం, వాటిని నిల్వవుంచిన తీరుపై కూడా కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ఎలుకలు తినేశాయని చెబుతున్న తీరు అనుమానాస్పదంగా వుందని పేర్కొంది. పైగా పోలీసులు ఎక్కడ వాహనాన్ని అడ్డగించారు, ఏసమయంలో జరిగింది వంటి వివరాలను వెల్లడించడంలో సాక్షులుగా వున్న ఏడుగురు పోలీసులు పరస్పర విరుద్ధమైన రీతిలో సాక్ష్యాలు చెప్పడాన్ని కోర్టు ప్రస్తావించింది. రద్దీగా వుండే జాతీయ రహదారిపై వీటిని స్వాధీనం చేసుకున్నా ఏ ఒక్క వ్యక్తి స్వతంత్ర సాక్షిగా లేకపోవడాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
200 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి !
- Advertisement -
- Advertisement -



