Thursday, January 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచలిలో యూరియా తిప్పలు

చలిలో యూరియా తిప్పలు

- Advertisement -

తెల్లవారుజామునే బారులు తీరిన రైతులు
యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌/ నిజాంపేట
యూరియా తిప్పలు మొదలయ్యాయి. ఎముకలు కొరికే చలిని సైతం తట్టుకుంటూ రైతులు బుధవారం తెల్లవారుజామునే లైన్‌లో నిలబడ్డారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రెండు దుకాణాలకు రెండు లారీల యూరియా వచ్చిందని తెలుసుకొని రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. నిజాంపేటతోపాటు వివిధ గ్రామాల రైతులు వచ్చి యూరియా కోసం నిరీక్షించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాసంగి నాటు వేసే సమయం దాటితే ఇబ్బంది అవుతుందని, సమయానికి యూరియా వేయాలని తెలిపారు. అయితే యూరియా కోసం గంటల కొద్ది లైన్‌లో నిలవడం చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులు చొరవ తీసుకొని అందరికీ యూరియా అందించాలని కోరారు. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి చెప్పారు. మండలానికి 2000 యూరియా బస్తాలు, 12వేల మెట్రిక్‌ టన్నుల యూరియా బస్తాలు కేటాయించారని తెలిపారు. మరో రెండ్రోజుల్లో రైతులందరికీ సరిపడా యూరియాను అందిస్తామన్నారు.

యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ : మంత్రి
యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉన్నదనీ, కలెక్టర్లు, ఆయా జిల్లాల్లో ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాల్లో సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ కొందరు కావాలనే రైతుల్లో అనవసర ఆందోళనలు సృష్టించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రబీకి అవసరమైన 10.40 లక్షల టన్నుల యూరియాలో ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈ డిసెంబర్‌లో రైతులు లక్ష టన్నుల యూరియాను అదనంగా కొనుగోలు చేశారని తెలిపారు.

గత రబీ సీజన్‌లో 79.54 లక్షల ఎకరాల్లో సాగు కాగా..ఈ సంవత్సరం 13.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని పేర్కొన్నారు. అవసరమైన మేరకు రాష్ట్రానికి యూరియా నిల్వలు తెప్పించి ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నామని వివరించారు. అందరూ ఒకే కేంద్రానికి వచ్చి ఇబ్బందులు పడకుండా మండలాల్లోని అన్ని రిటైల్‌ కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. యాప్‌ అమలవుతున్న జిల్లాల్లో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ఐదు జిల్లాల్లో దాదాపు లక్ష మంది రైతులు యాప్‌ ద్వారా 3.19 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.

పక్కదారి పట్టకుండా చర్యలు
రైతులకు సకాలంలో యూరియా అందేలా, పక్కదారి పట్టకుండా చూసేందుకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి ప్రత్యేక అధికారులను నియమించిన విషయం విదితమే. ప్రత్యేక అధికారులు తమ కేటాయించిన జిల్లాల్లో యూరియా నిల్వలు, సరఫరా, అమ్మకాల తీరుపై ఆరా తీస్తున్నారు. కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి యూరియా అమ్మకం కేంద్రాల్లో తనిఖీలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, అమ్మకాలు, రైతుల అవసరాలపై ఎప్పటికప్పుడు వివరాలను తెప్పించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -