Thursday, January 1, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీ పాలనలో మోడల్‌ స్టేట్‌ దుస్థితి

బీజేపీ పాలనలో మోడల్‌ స్టేట్‌ దుస్థితి

- Advertisement -

సామాజిక కార్యకర్తల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆగ్రహం

గుజరాత్‌లో పోషకాహార లోపం
ప్రభుత్వ వైఫల్యం, వ్యవస్థలో లోపాలే కారణం

గుజరాత్‌లో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ సమస్యను పరిష్కరించడంలో అక్కడి బీజేపీ సర్కారు విఫలమవుతున్నది. ఇక్కడి పిల్లలు, తల్లులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలే చెప్తున్నాయి. మహిళలు, చిన్నారుల కోసం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని గుజరాత్‌ ప్రభుత్వం చెప్తున్నా.. వాటి ప్రయోజనాలు మాత్రం క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చేరటం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల మహిళలు, పిల్లలు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం, పటిష్ట అమలు వ్యవస్థలు లేకపోవడం వంటివి గిరిజన మహిళలు, పిల్లలను అత్యంత ప్రభావితం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

గాంధీనగర్‌ : గుజరాత్‌ సీఎంగా మోడీ అధికారంలో ఉన్న సమయంలో ‘గుజరాత్‌ మోడల్‌’ అంటూ తీవ్ర ప్రచారాన్ని కల్పించుకున్నారు. రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి కావడంతో పాటు దేశ ప్రధాని కాగలి గారు. కానీ మోడీ చెప్పిన గుజరాత్‌ మోడల్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. రాష్ట్రంలో తల్లులు, పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గిరిజనులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించాలని తీసుకొచ్చిన పథకాలు కూడా సరిగ్గా అమలు కావటం లేవు. అందులోనూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌ రాష్ట్రాన్ని పోషకాహారలోపం లేని రాష్ట్రంగా మార్చుతామని అక్కడి ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నది. ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతీ కనబడటం లేదు. దీంతో అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రభుత్వ ఆశయానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన గణాంకాలే వాస్తవ పరిస్థితులను బయటపెడుతున్నాయి. రాష్ట్రంలో పిల్లలు, తల్లులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పథకాలు కాగితాలకే పరిమితమా!
పాలసీ అమలు, పరిపాలనా సామర్థ్యం, ఆర్థిక వృద్ధి అంటూ ప్రగల్భాలు పలికే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉన్నది. ఏండ్లుగా ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. వాటి ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు మాత్రం నెరవేరడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాలు చేసే ‘గొప్ప నినాదాలు’.. గణాంకాలు చెప్పే వాస్తవాల ముందు ఓడిపోతున్నాయి. గుజరాత్‌లో జననీ సురక్ష యోజన, కస్తూర్బా పోషణ సహాయ యోజన, ప్రధాన మంత్రి మాతృ సురక్ష అభియాన్‌, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, మాల్‌ న్యూట్రీషన్‌ ఫ్రీ గుజరాత్‌ అభియాన్‌ వంటి అనేక పోషణ, మాతృ సంక్షేమ పథకాలు అమలులో ఉన్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. కానీ వాటి అమలే అసలు సమస్యగా కనిపిస్తున్నది.

సంక్షేమ పథకాల్లో మోసాలు : కాంగ్రెస్‌ పార్టీ
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. పోషకాహార సూచికలు ఎందుకు మెరుగుపడటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. సంక్షేమ పథకాలు.. కొందరు అధికారులు, మధ్యవర్తులకు లాభాల మార్గాలుగా మారాయన్న అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ”పథకాలు లబ్దిదారులకు చేరకుండా మోసాలుగా మారుతున్నాయి. ఈ పథకాలు సరిగ్గా అమలైతే పోషకాహార లోపాన్ని ఎదుర్కోవచ్చు. కానీ రాష్ట్రంలో అలా జరగటం లేదు” అని గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్‌ దోషీ అన్నారు. తాజా గణాంకాలు గుజరాత్‌ మోడల్‌ వాస్తవ పరిస్థితులను బయటపెట్టాయని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రాథమిక పోషణ, ఆరోగ్య సేవలు ప్రజలకు సరిగ్గా అందాలనీ, వాటిని పట్టించుకోకుండా మోడల్‌, అభివృద్ధి నినాదాలు చేయడం అర్థరహితమని వివరిస్తున్నారు. వ్యవస్థలోని లోపాలను సవరించి గిరిజన మహిళలు, పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మహిళలు, పిల్లలపై తీవ్ర ప్రభావం
గిరిజన ప్రాంతాల్లో మరింత ఆందోళనకరం
3.21 లక్షల మంది చిన్నారుల్లో సమస్య
78 శాతం మంది గిరిజన మహిళల్లో రక్తహీనత

గిరిజన మహిళల్లో రక్తహీనత
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గుజరాత్‌లో 15-49 ఏండ్ల మధ్య వయసున్న గిరిజన మహి ళల్లో 78శాతం మంది రక్త హీనత(ఎనీమియా)తో బాధ పడుతున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా.. గర్భధారణ సమయంలో ప్రమాదా లను పెంచి, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, తద్వారా వచ్చే తరంలో పోషకాహార లోపం కొనసాగడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఎనిమియా ఫ్రీ ఇండియా, న్యూట్రీషన్‌ రిహా బిలిటేషన్‌ ప్రోగ్రాం వంటి పథకాలు, కార్య క్రమాలు అధికారికంగా అమలులో ఉన్నప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత, అవగాహన లేమి కారణంగా అవి ప్రభావవంతంగా పని చేయడం లేవనే విమర్శలున్నాయి.

మూడు లక్షల మందికిపైగా చిన్నారుల్లో పోషకాహార లోపం
ఐదేండ్లలోపు వయసుగల పిల్లల్లో సుమారు 3.21 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. దీంతో శిశువులు, చిన్నారులలో శారీరక, మానసిక వికాసం తీవ్రంగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పోషణ లేక ఈ పిల్లలు జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందనీ, వారిలో నేర్చుకునే సామర్థ్యం (అభ్యాస శక్తి) తగ్గి దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.

అంగన్వాడీలకు నిధులు కరువు
గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పోషకాహార సరఫరాలో లోపాలు, పర్యవేక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. నిధులు కేటాయించినప్పటికీ.. పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు పూర్తిగా విఫలం కావడంతో అక్కడి మహిళలు, పిల్లలు సంక్షేమ ప్రయోజనాల నుంచి వెలివేయబడుతున్నారని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -