ఢిల్లీ, తమిళనాడులోనూ లింకులు
ముంబయి : మహారాష్ట్రలో కిడ్నీ రాకెట్‌కు ఢిల్లీ, తమిళనాడుతోనూ సంబంధాలున్నట్లు వెలుగుచూసింది. స్థానిక వడ్డీ వ్యాపారులు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి తన కిడ్నీని కాంబోడియాలో విక్రయించాల్సి వచ్చిందని చంద్రపూర్ జిల్లాకు చెందిన రైతు రోషన్ కుడే ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. కాంబోడియా వరకూ ఉన్న సంబంధాలు, దేశవ్యాప్తంగా ఉన్న ఏజెంట్లు, దాతలు, వైద్యులు, ఆసుపత్రులతో కూడిన పాన్ – ఇండియా కిడ్నీ మార్పిడి నెట్‌వర్క్ బయటకు వచ్చింది. న్యూఢిల్లీ, తమిళనాడు తిరుచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనేక అక్రమ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లు ఆధారాలు లభించాయని పోలీసు అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ, తిరుచ్చిలోని ఇద్దరు వైద్యులను అదుపులోకి తీసుకోవడానికి అక్కడకు ప్రత్యేక దర్యాప్తు బృందం, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది వెళ్లినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు, కిడ్నీ దాతలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడైంది. ఇది మరొక దోపిడీ అని పోలీసు అధికారులు చెప్పారు.



