చర్చి ఫాదర్ దంపతులు సహా 12మంది అరెస్టు
నాగపూర్ పోలీసుల నిర్వాకం
ఈ అరెస్ట్ రాజ్యాంగ స్వేచ్ఛను హరించడమే : సీఎం పినరయి విజయన్
నాగపూర్, కొట్టాయం : బలవంతపు మత మార్పిడు లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కేరళకు చెందిన చర్చి ఫాదర్‌ని, ఆయన భార్యను, మరో 12మందిని మంగళవారం రాత్రి నాగపూర్‌లో పోలీసులు అరెస్టు చేయడంపై మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విషయం గురించి వాకబు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు బెనొడా పోలీసు స్టేషన్‌లో వున్నారు. త్వరలో కోర్టుముందు హాజరుపరిచే అవకాశం వుంది. పోలీసు స్టేషన్‌లోనే బెయిల్ కోసం సీఎస్‌ఐ చర్చ్ ప్రతినిధులు ప్రయత్నించినా, కోర్టును ఆశ్రయించాల్సిందిగా పోలీసులు చెప్పారు. పైగా ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా వారికి అందచేయలేదు.ఫాదర్ సుధీర్ గత ఐదేండ్లుగా మహారాష్ట్రలో ఉంటున్నారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు, ఇతర మిషనరీలతో కలిసి స్థానికంగా ఒక నివాసానికి చేరుకున్నారు. ఆహ్వానించిన వ్యక్తి పుట్టినరోజు కూడా కావడంతో అక్కడ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ఫాదర్ బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ బజరంగ్ దళ్ కార్యకర్త చేసిన ఫిర్యాదుతో నాగపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) బిషప్ సాబు మలై కౌషు తీవ్రంగా ఖండించారు. కొట్టాయంలో ఆయన మాట్లాడుతూ, ఈ చర్యలు రాజ్యాంగ స్వేచ్ఛకు విఘాతమని అన్నారు. నాగ్‌పూర్‌లో గత 12సంవత్సరాలుగా సుధీర్ సేవలందిస్తున్నారని చెప్పారు. పిల్లలకు విద్యను అందించడంతో పాటూ స్థానికంగా ప్రజలకు చేదోడు వాదోడుగా వుంటారని అన్నారు. పలు గ్రామాల అభివృద్ధిలో ఆయన గణనీయమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. సహకారం అందిస్తున్నారని అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బిషప్‌లు ఉప రాష్ట్రపతిని కలిసిన మరుసటి రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం. క్రైస్తవ మత పెద్దలు, పలువురు రాజకీయ నేతలు కూడా ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వెలిబుచ్చారు.
రాజ్యాంగ స్వేచ్ఛను హరించడమే : ముఖ్యమంత్రి ఖండన
బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై ఫాదర్ అరెస్ట్ రాజ్యాంగ స్వేచ్ఛను హరించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాదర్ సుధీర్, ఆయన భార్యతో పాటు 12మంది సహచరుల అరెస్ట్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. వారి అరెస్ట్ తీవ్ర ఆందోళన కలిగించిందని అన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు సంఫ్‌ుపరివార్ అనుసరిస్తున్న ఇటువంటి ఆందోళనకర విధానాలు, చర్యలు రాజ్యాంగ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. గతంలో జబల్‌పూర్‌లో కూడా ఇదే తరహా ఘటనను చూశామని అన్నారు.ప్రతిపక్ష నేత వి.డి.సతీశన్ దీనిపై ప్రధాని, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై ఆందోళన వెలిబుచ్చారు. శాంతియుతంగా ప్రార్ధనలు చేసుకుంటున్నవారిని అరెస్టు చేయడం రాజ్యాంగానికి, మన ప్రజాస్వామ్య విలువల స్ఫూర్తికి విరుద్ధమన్నారు.



