– నిబద్ధత, క్రమశిక్షణతో ఆదర్శ పోలీస్ అధికారిగా గుర్తింపు..
నవతెలంగాణ – రాయపోల్
నిబద్ధత, క్రమశిక్షణతో ఆదర్శ పోలీస్ అధికారిగా గుర్తింపు పొంది దీర్ఘకాలం పోలీస్ శాఖలో సేవలందించి ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న ఏఎస్ఐ ఎన్.వి.ఆర్. కృష్ణం రాజుకు ఘనంగా వీడ్కోలు పలకడం జరుగుతుందని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ అభినందన సభలో ఎస్సై మానస తో కలిసి సీఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎస్ఐ కృష్ణం రాజు తన 35 సంవత్సరాల ఉద్యోగ జీవితమంతా క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతతో పనిచేశారని ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు పొందిన అధికారిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించిన తీరు యువ పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.కృష్ణం రాజు తన సేవా కాలంలో అనేక కీలక కేసులను సమర్థవంతంగా పరిష్కరించడమే కాకుండా, శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో తన వంతు కృషి చేశారని అధికారులు గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా ధైర్యంగా పనిచేసిన తీరు ప్రశంసనీయమని అన్నారు. ఆయన ఉత్తమ పనితీరుకు ఎన్నో అవార్డులు రివార్డులు పొందడం జరిగిందన్నారు.ఈ సభలో ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా అభినందించారు. సహచరులందరూ ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడిన ఏఎస్ఐ కృష్ణం రాజు, తనకు ఈ స్థాయిలో గౌరవం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన సేవా ప్రయాణంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచరులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ కుంచం మానస, ఏఎస్ఐ దేవయ్య, హెడ్ కానిస్టేబుల్స్ భాస్కర్ రెడ్డి, కనకయ్య, స్థానిక సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ రాజు,దిశ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్ఐ కృష్ణం రాజుకు ఘన వీడ్కోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



