కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని 26వ వార్డులో కాంగ్రెస్ నాయకులు సిర్రం ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో, తిప్పాపూర్‌లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన ఆటో యూనియన్ సభ్యులను విప్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న భీమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొంటానని తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నూతన సంవత్సరంలో మరింత ముందుకు సాగాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక, ధార్మిక రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తోందని తెలిపారు.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లతో పనులు చేపడుతున్నామని, సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నిమ్మపల్లి వరకు, అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
కలికోట సూరమ్మ చెరువు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, కుడి–ఎడమ కాల్వల నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.45 కోట్లు మంజూరు చేసి రైతులకు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ పనుల ద్వారా మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.


