చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, కొయ్యుర్, వళ్లెంకుంట, కొండంపేట, ఎడ్లపల్లి, రుద్రారం, నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో గుట్టుగా గుట్కాలు, అంబార్ దందా పాన్ డబ్బాలు, కిరాణాషాపుల్లో విచ్చలవిడిగా కొనసాగుతోంది. దీంతో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నచందం నడుస్తోంది. ఇంతా జరుగుతున్న సంబంధించిన ఎక్షైజ్ శాఖ అధికారులు మాముళ్ళకు తలోగ్గుతూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొయ్యుర్ కు చెందిన ఓ గుట్కా వ్యాపారి నిత్యం మండలంలోని అన్ని గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లోకి సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తయారీ సంస్థలు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు అప్రమత్తమై దుకాణాల్లో పెద్దెత్తున నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మండల వ్యాప్తంగా నెలకు రూ. వేలల్లో హోల్సేల్, రిటైల్ దందా నడుపుతున్నట్లు సమాచారం. రోజుకు ఒక్కొక్క దుకాణంలో 300 నుంచి 400 వరకు గుట్కాలను అమ్ముతున్న వ్యాపారులు కూడా ఉన్నారు. ఒక్కరే రోజూ 20 నుంచి 30 ప్యాకెట్ల వరకు వినియోగిస్తున్నారు. గుట్కాలను ఎక్కువగా వాహనాల డ్రైవర్లు, కూలీలు, కార్మికులు సైతం వాడుతున్నారు. ఎక్కువ దూరం ప్రయాణిస్తున్న సమయంలో నిద్రమత్తులోకి జారుకోకుండా గుట్కాలను వాడుతున్నట్లు చెబుతుండటం విడ్డూరం.
గుట్కాలు హానికరం: వినయ్ భాస్కర్ తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి
గుట్కాలు, జర్దాలు వినియోగిస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది. దంతాలు పాడై పోయి, చిగుళ్లుకు పుండ్లు తయారవుతాయి. ఫలితంగా క్యాన్సర్ వస్తుంది. అంతే కాకుండా అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. తినే ఆహారం సైతం రుచించదు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.



