హాట్‌లిస్ట్‌లో అమన్, యుయి సుసాకి
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) వేలం పాటకు రంగం సిద్ధమైంది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో తొలిసారి జరుగబోతున్న పీడబ్ల్యూఎల్ కోసం ప్లేయర్ల ఎంపిక ప్రక్రియ అన్ని హంగులతో సమాయత్తమైంది. ఈనెల 3న జరుగనున్న పీడబ్ల్యూఎల్ వేలం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పారిస్(2024) ఒలింపిక్స్ కాంస్య విజేత అమన్ సెహ్రావత్‌తో పాటు విదేశీ స్టార్ రెజ్లర్లు యుయి సుసాకి, యుసెనిలిస్ గుజ్‌మన్ లోపెజ్ రూ.18 లక్షల కనీస ధరతో వేలంలోకి అడుగుపెడుతున్నారు. అధిక బరువు కారణంగా అర్హత కోల్పోయిన అమన్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ విధించిన నిషేధం తొలిగిపోవడంతో అతనికి లైన్‌క్లియర్ అయ్యింది. ఒలింపిక్స్‌తో పాటు ఆసియాగేమ్స్, ప్రపంచ, కామన్వెల్త్‌గేమ్స్‌లోనూ పతకాలు సాధించడంతో అమన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అమన్‌తో పాటు భారత్ నుంచి దీపక్‌పునియా, నవీన్ రూ.10 లక్షల కేటగిరీలో ఉండగా, యువ రెజ్లర్ సుజిత్ కల్కల్ రూ.7లక్షల విభాగంలో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఇక మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ మెడలిస్టు అంతిమ్ పంగల్, అన్షు మాలిక్ రూ.10లక్షల ధరతో వేలంలోకి రానుండగా, జాతీయ గేమ్స్ చాంపియన్ సాత్వి షిండే, పూజ గెహ్లాట్ భారత టాప్ రెజ్లర్లుగా రేసులో ఉన్నారు. ఈనెల 15 నుంచి మొదలయ్యే పీడబ్ల్యూఎల్ సీజన్-1లో ఆరు ఫ్రాంచైజీలు హర్యానా థండర్స్, టైగర్స్ ఆఫ్ ముంబై దంగల్స్, పంజాబ్ రాయల్స్, మహారాష్ట్ర కేసరి, ఢిల్లీ దంగల్ వారియర్స్, యూపీ డామినేటర్స్ పోటీలో ఉన్నాయి.



