ఐదు లక్షల మందితో ఇస్తాంబుల్‌లో భారీ ప్రదర్శన
పాలస్తీనాకు సంఘీభావంగా టర్కీలో వెల్లువెత్తిన మద్దతు
ఇస్తాంబుల్ : ఇజ్రాయిల్ నరమేధాన్ని వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు సంఘీభావంగా వేలాదిమంది ఇస్తాంబుల్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా నగరంలోని చారిత్రాత్మక గలాటా బ్రిడ్జిపై ఈ భారీ ప్రదర్శన చేపట్టారు. ఐదు లక్షల మంది ప్రజలు ఈ మార్చ్‌లో పాల్గొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం గాజాలో అమలవుతోందని చెబుతున్న కాల్పుల విరమణ ‘పాలస్తీనియన్లపై నెమ్మదిగా సాగతున్న ఊచకోత తప్ప మరొకటి కాదు’ అని వారు తీవ్రంగా నిరసించారు. కాల్పుల విరమణ గాజాలో అర్ధవంతమైన ఉపశమనాన్ని తీసుకువచ్చిందంటూ చెప్పుకోవడాన్ని వారు ఖండించారు. ఇది నిజమైన కాల్పుల విరమణే కాదని స్పష్టం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో పాలస్తీనా, టర్కీ జెండాలను ప్రదర్శించడంతో పాటు ”మేము మౌనంగా ఉండము”, ”పాలస్తీనాను మరిచిపోము” అని నినాదాలు చేశారు.
‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ లెబనాన్‌కి చెందిన గాయకుడు పాటతో సహా పలువురు వక్తలు ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. టర్కీలోని ఫుట్‌బాల్ క్లబ్‌తో పాటు ‘నేషనల్ విల్ ప్లాట్‌ఫామ్’ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. సుమారు 400కి పైగా పౌర సంఘాలు ఈ ర్యాలీలో భాగస్వామ్యమయ్యాయంటే గాజాపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న అమానుష దాడులపై ప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో వుందో అర్ధమవుతోంది. గాజాపై అమానుష దాడులను నిరసిస్తూ టర్కీ చేపడుతున్న నిరసన ప్రదర్శనల్లో ఇది భారీ ప్రదర్శనగా నిలిచింది.ఈ నిరసన చూస్తుంటే పాలస్తీనా మద్దతుపై రాజకీయాలకు అతీతంగా జాతీయ ఏకాభిప్రాయం వ్యక్తమవుతోందని మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. కొత్త సంవత్సరం తొలి రోజునే ప్రజలు తమ మద్దతును తెలియచే యాలనుకున్నారని పేర్కొన్నాయి. గాజాలో ఏం జరుగుతోందో ప్రపంచం మరిచిపోకూడదని గుర్తు చేయడానికే ఈ ప్రదర్శన అని వ్యాఖ్యానించాయి.



