పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా సొమ్ముతోపాటు అంత్యక్రియల ఖర్చుల సాయం కలిపి అంతే…
హైకోర్టులో కౌంటర్ పిటిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులైన 54 మంది కార్మికుల కుటంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామన్న ఆ కంపెనీ బాధిత కార్మికుల కుటుంబాలకు రిక్తహస్తాన్ని చూపింది. తాము చెల్లించేంది రూ.42 లక్షలు చొప్పున మాత్రమేనని, అది కూడా కార్మికులకు చట్ట ప్రకారం ప్రావిడెంట్ ఫండ్, బీమా, ఈఎస్‌ఐ తదితర విధానాల్లో లభించే ప్రయోజనాలతోపాటు అంత్యక్రియలు కోసం ఇచ్చిన ఆర్థిక సాయం కూడా కలిపి మొత్తం రూ.42 లక్షలని తేల్చి చెప్పింది. కోటి రూపాయల పరిహార హామీని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం పాశమైలారంలో గత ఏడాది జూన్ 30న జరిగిన సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన 54 మంది కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఏవిధంగా చెల్లింపులు ఉంటాయో సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో ఈ వివరాలను వెల్లడించింది.
గత ఏడాది జులై 1న కుదిరిన ఒప్పందం మేరకు రూ.42 లక్షలు మాత్రమే కంపెనీ చెల్లిస్తుందని నివేదించింది. ప్రమాద సమయంలో ప్రకటించిన కోటిలో రూ.42 లక్షలు పోను మిగిలింది ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందని వివరించింది. సిగాచీలో పేలుడు ఘటనపై సిబిఐతో దర్యాప్తునకు ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన కె.బాబూరావు పిల్ దాఖలు చేశారు. ఇందులో సిగాచీ అధికారి దాఖలు చేసిన కౌంటర్‌లో ఇంతవరకు ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.5 నుంచి 30 లక్షల వరకు చెల్లించినట్లు తెలిపింది. మిగిలిన మొత్తం పరిహారాన్ని ఈ ఏడాది మార్చి నాటికి అందజేస్తామని, ఇందు నిమిత్తం పోస్టు డేటెడ్ చెక్కులు అందజేసినట్లు తెలిపింది. పిల్‌పై హైకోర్టు ఈ నెల 29న విచారణ చేయనుంది.
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని కోరుతూ లాయర్ పి. పద్మారావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ కొట్టేసింది. బార్ కౌన్సిళ్ల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారించి ఎన్నికల నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసినందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చింది.



