Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇదేం వైద్యం!

ఇదేం వైద్యం!

- Advertisement -

అక్కడ స్వీపర్‌, సెక్యూరిటీ గార్డులే డాక్టర్లు
రోగులకు వైద్యసేవలు అందిస్తుంది వారే…
రిపోర్టులు రాసుకోవడంలో అసలు వైద్యులు బిజీ
అస్తవ్యస్తంగా రామాయంపేట సర్కారు దవాఖాన
పట్టించుకోని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు

నవతెలంగాణ-రామయంపేట
అదో ప్రభుత్వాసుపత్రి. అక్కడ స్వీపర్‌, సెక్యూరిటీ గార్డులే వైద్యులు. రోగులకు వైద్యసేవలు అందించేది వారే. మరి అసలు డాక్టర్లు ఏం చేస్తుంటారనేగా సందేహం. వారు తాము చాలా గొప్పగా వైద్య సేవలు అందిస్తున్నామని రికార్డులు రాసేసుకుంటూ బిజీగా ఉంటారు. ఓవైపు అమ్మా, అయ్యా అని రోగులు ముక్కుతూ, మూలుగుతూ వైద్యానికి వస్తే, ఏమాత్రం మానవత్వం లేకుండా ‘ఓ కట్టుకట్టి పంపేరు’ అంటూ స్వీపర్‌, సెక్యూరిటీగార్డుల్ని పురమాయిస్తున్న తీరు… మెదక్‌ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కనిపిస్తుంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వ వైద్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. పేదల్లో సర్కారుపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఇక విషయానికి వస్తే…మెదక్‌ జిల్లాలోని నార్సింగ్‌ మండలం జప్తి శివునూర్‌ గ్రామ సమీపంలో గురువారం ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని చూసి ప్రజలు స్పందించారు. కానీ ఆస్పత్రిలో వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాస్తవానికి ఈ ఆస్పత్రిలో నలుగురు వైద్యులు ఉండాలి.

వారిలో ఇద్దరే విధుల్లో ఉన్నారు. ఆ ఇద్దర్లో ఒకరు వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లారు. ఉన్న ఒక్క డాక్టర్‌ మెడికల్‌ రికార్డులు రాసుకుంటూ, బాధితుల్ని ఏమాత్రం పట్టించు కోకపోవడంతో క్షతగాత్రుల్ని తెచ్చిన స్థానిక ప్రజలు ప్రశ్నించారు. ‘ఏం చేయాలి…కట్లు కడతారు ఉండండి’ అంటూ అక్కడి స్వీపర్‌, సెక్యూరిటీగార్డును పిలిచి అదేందో చూడమని పురమాయించారు. దీనితో వారే క్షతగాత్రుల గాయాలను శుభ్రం చేసి, కట్లు కట్టారు. డాక్టర్‌ మాత్రం సీట్లోంచి లేచేందుకు కూడా ఇష్టపడలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైద్యం ఇంత అధ్వాన్నంగా మారిందంటూ దుమ్మెత్తిపోశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మంది బాధితులు రక్తపు మడుగులో నానా అవస్థలు పడుతుంటే, ఉన్న ఒక్క డాక్టర్‌ తన పనిలో తాను ఉండి, పట్టించుకోకపోవడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. చాలాకాలంగా ఈ ఆస్పత్రి ఇదే తరహాలో నడుస్తున్నదని చెప్తున్నారు. ఆస్పత్రి రికార్డులు మాత్రం పక్కాగా ఉంటాయనీ, కానీ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని రోగులు చెప్తున్నారు. అయినా రోగులకు స్వీపర్‌, సెక్యూరిటీగార్డులు వైద్యం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రి నిర్వహణపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

విచారణ జరుపుతాం : శివదయాల్‌, జిల్లా వైద్యాధికారి
రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రి వ్యవహారం దృష్టికి వచ్చింది. దానిపై విచారణ జరుపుతాం. అక్కడి వైద్యులతో ఇప్పటికే మాట్లాడాను. విచారణ నివేదిక వచ్చాక, దాని ప్రకారం అక్కడి సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -