ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే
కోడ్‌లతో కార్మికులు చట్టపర రక్షణ కోల్పోయే ప్రమాదం
ఈ పోరాటం కార్మికుల కోసమే కాదు ప్రజాస్వామ్య, గణతంత్ర ఉనికి కోసం కూడా
ఫ్లోర్ వేజ్ విధానంతో కనీస వేతన పద్ధతికి దెబ్బ : కేరళ సీఎం పినరయి విజయన్
సీఐటీయూ మహాసభల ప్రాంగణం నుంచి…
కార్మికవర్గం ప్రాథమిక హక్కు అయిన సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడమంటే ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే అవుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. లేబర్ కోడ్‌లతో కార్మికులు చట్టపరంగా రక్షణ కోల్పోయే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటం కార్మికుల హక్కుల కోసమే కాదనీ, దేశ ప్రజాస్వామ్య, గణతంత్ర ఉనికిని కాపాడటం కోసం కూడా అని స్పష్టం చేశారు. సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభల సందర్భంగా జాతీయ కార్మిక సదస్సు- 2025కు తన సందేశాన్ని పంపారు. సమ్మెకు ముందు 14 రోజుల ముందు నోటీసు తప్పనిసరి చేయడం, చర్చలు పెండింగ్‌లో ఉన్నప్పుడు సమ్మెను నిషేధించడం వంటివి సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. నెలకు రూ.18వేల కంటే ఎక్కువ సంపాదిస్తూ పర్యవేక్షణ హౌదాలో ఉన్నవారిని ”కార్మికుడు” అనే నిర్వచనం నుంచి తొలగించడం దారుణమన్నారు.
90 శాతానికి పైగా పరిశ్రమల్లో ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండానే కార్మికులను తొలగించేలా నిబంధనలను (పరిమితిని 100 నుండి 300 కార్మికులకు పెంచారు) మార్చారనీ, ఇది ”హైర్ అండ్ ఫైర్” (కావాలన్నప్పుడు తీసుకోవడం, వద్దనుకున్నప్పుడు తీసేయడం) విధానాన్ని చట్టబద్ధం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా నిర్ణయించాల్సిన కనీస వేతన పద్ధతిని దెబ్బతీసేలా ఫోర్ వేజ్ విధానం ఉందని విమర్శించారు. ఆహారం, బట్టలు, నివాసం వంటి కనీస అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా వేతనాలను నిర్ణయించడం వల్ల కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్లు స్విగ్గీ, జొమాటో, ఉబెర్ వంటి సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది యువతకు సామాజిక భద్రత కల్పించడంలో స్పష్టత లేదని తెలిపారు. వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఎత్తిచూపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి వంటి వాటిని ఇతర అవసరాలకు మళ్లించే అధికారాన్ని కేంద్రం తీసుకోవడం కార్మికుల సొమ్మును దుర్వినియోగం చేయడమేనన్నారు.
8 గంటల పని దినాన్ని 12 గంటల వరకు పెంచే అధికారాన్ని ప్రభుత్వం పొందిందనీ, ఇది కార్మికుల శారీరక మానసిక శ్రమకు దారితీస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. ప్లాంటేషన్ లేబర్ యాక్ట్, మైన్స్ యాక్ట్ వంటి 13 నిర్దిష్ట రంగాల చట్టాలను రద్దు చేయడం ఆయా రంగాల్లోని ప్రత్యేక భద్రతా ప్రమాణాలను విస్మరించడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్‌గా మార్చి ఆ చట్ట ప్రాథమిక లక్ష్యాలకు తూట్లు పొడించిందని విమర్శించారు. ప్రస్తుతం వేతనాల్లో 100శాతం కేంద్రమే భరిస్తుండగా కొత్త ప్రతిపాదన ప్రకారం రాష్ట్రాలు కూడా 40 శాతం భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది కేరళ వంటి రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 60 లక్షల మందికిపైగా నెలకు రూ.2వేల చొప్పున సంక్షేమ పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ అని చెప్పారు. వలస కార్మికుల కోసం ‘ఆవాస్’ బీమా మరియు ‘అప్నా ఘర్’ వంటి గృహ నిర్మాణ పథకాలను కేరళ విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టిన ‘హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్’ను కేరళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ‘కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’గా పునరుద్ధరించిందని తెలిపారు.
కార్మిక హక్కులను కాపాడటంలో సీఐటీయూ ముందంజ
ఆల్-చైనా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంఘీభావ సందేశ
కార్మికుల హక్కుల కాపాడటంతో సీఐటీయూ ముందంజలో ఉందని ఆల్ చైనా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పేర్కొంది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) 18వ మహాసభల ప్రారంభోత్సవ సందర్భంగా సంఘీభావ సందేశాన్ని పంపింది. భారతీయ కార్మికవర్గానికి, సీఐటీయూకు శుభాకాంక్షలు తెలిపింది. మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించింది. జాతీయ కేంద్రంగా కార్మికుల హక్కులను కాపాడటంలో, పని పరిస్థితులను మెరుగు పరచడంలో, సామాజికన్యాయాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాలుగా కృషి చేస్తోందని కొనియాడింది.
ఈ 18వ మహాసభలు భారతీయ కార్మిక వర్గాన్ని మరింత ఐక్యం చేస్తాయనీ, సామాజిక అభివృద్ధి, భాగస్వామ్య శ్రేయస్సు దిశగా కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఆకాంక్షించింది. ఏసీఎఫ్‌టీయూ, సీఐటీయూల మధ్య సుధీర్ఘ కాలంగా స్నేహపూర్వక సంబంధాలున్నాయని గుర్తుచేసింది. కార్మికుల హక్కుల రక్షణ, ట్రేడ్ యూని యన్ సామర్థ్య పెంపు, నూతన ఆవిష్క రణల వంటి అంశాల్లో సీఐటీయూతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రెండు దేశాల కార్మిక ఉద్యమాల పురోగతికి ఈ సహకారం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
న్యూక్లియర్ చట్టసవరణను వెనక్కి తీసుకోవాలి
సీఐటీయూ అఖిల భారత మహాసభ తీర్మానం
ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ఆమోదించుకున్న న్యూక్లియర్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తీర్మానాన్ని సీఐటీయూ కోశాధికారి ఎం.సాయిబాబు ప్రవేశపెట్టగా, వీఎస్.రామ బలపర్చారు. న్యూక్లియర్ చట్ట సరవణతో అణు శక్తి రంగాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడమేననీ, దానివల్ల దేశ భద్రతకు చాలా నష్టం చేకూరుతుందని హెచ్చరించారు. పౌర అణుశక్తి రంగం ప్రయివేటీకరణ జరుగుతుందన్నారు. ఈ బిల్లును మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎటువంటి చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా ఆమోదింపజేసుకోవడం దారుణమన్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని సీఐటీయూ వ్యతిరేకిస్తోందన్నారు.



