Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంలోపాలు, లొసుగులమయం బెంగాల్‌ సర్‌ !

లోపాలు, లొసుగులమయం బెంగాల్‌ సర్‌ !

- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌) ప్రక్రియలో అనేక తీవ్రమైన అవకతవకలు, లోపాలు, లొసుగులు, అసమానతలు నెలకొన్నాయంటూ పలు వార్తలు వస్తున్నాయి. మతువాలు- పూర్వపు తూర్పు బెంగాల్‌ నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్లను మినహాయించడం అటువంటి అవకతవకల్లో ఒకటి. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న వేళ..పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీల ప్రతినిధుల బృందం బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను కలిసి ఒక మెమోరాండాన్ని సమర్పించింది. సర్‌లోని అవకతవకలను సరిదిద్దాలని కోరింది.

మతువాల భయాందోళనలు
తమ కమ్యూనిటీలో చాలామందికి ‘వారసత్వ డేటా’ లేనందున ఓటర్ల జాబితాలో తమ పేర్లు తొలగిస్తారనే భయాందోళనలు బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ శరణార్ధులు ప్రధానంగా వున్న మతువా కమ్యూనిటీలో వ్యక్తమవుతున్నాయి. సబార్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైన అంశాలు వీరి ఆందోళనలను మరింత పెంచాయి. మతువాల ఆధిపత్యం కలిగిన నియోజకవర్గాల్లో గణనీయంగా ఓటర్ల తొలగింపులు జరిగినట్టు ఆ సర్వేలో వెల్లడైంది. వీరిలో చాలామందిని ‘శాశ్వతంగా తరలిపోయారు’ లేదా ‘ఆచూకీ తెలియలేదు’ అనే కేటగిరీల్లో చేర్చారు. ఇప్పటికే ఈ కమ్యూనిటీ సామాజికంగా, ఆర్థికంగా వెనక్కి నెట్టబడిన పరిస్థితుల్లో తాజాగా ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం వారిని మరింత ముప్పులోకి నెట్టేస్తుంది.

సర్‌ ప్రక్రియలో వ్యవస్థాగతమైన తప్పులు
వ్యవస్థలోని సాంకేతిక సమస్య ముఖ్యంగా 2002నాటి ఓటర్ల జాబితా డేటా అసంపూర్తిగా మార్పిడి కావడంతో మ్యాపింగ్‌ సమస్య తలెత్తింది. ఓటర్లుగా జాబితాలో చేర్చాల్సినవారిని ‘మ్యాపింగ్‌ చేయనివారు’గా ముద్ర వేసే పరిస్థితికి దారి తీసింది. ఈ వ్యవస్థాగతమైన తప్పు వృద్ధుల్లో, వికలాంగుల్లో ఆందోళనలకు, ఇబ్బందులను కలిగించే అవకాశం వుంది.

స్థానిక ఎన్నికల అధికారుల ఆందోళనలు
ఒక వ్యక్తి చట్టబద్ధమైన ఓటరు అవునా కాదా అని నిర్ణయించగలిగే స్థానిక ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారుల (ఈఆర్‌ఓ) చట్టబద్ధమైన పాత్రను ఈ మొత్తం ప్రక్రియలో పక్కకు నెడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పాత్ర లేకుండా చేయడం, ఓటర్ల తొలగింపు నోటీసులు ఆటోమేటిక్‌గా రూపొందే కేంద్రీకృత పోర్టల్‌ ఎన్నికల కమిషన్‌ వద్దనే వుండడం పట్ల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు ఆందోళనలు, అభ్యంతరాలు వెలిబుచ్చుతు న్నారు. ఓటరు పేరు తొలగింపు నోటీసులు జారీ చేయాల్సిన బాధ్యత చట్టప్రకారం ఈఆర్‌ఓలది, జాబితానుంచి వారి పేర్లను తొలగించడానికి ముందుగా వారు చెప్పేవి వినేందుకు కనీసం అవకాశం వుండేది. తాజా పరిస్థితుల్లో ఆ అవకాశం వుండడం లేదు.కొన్ని కేసుల్లో ఈఆర్‌ఓల ప్రమేయం అస్సలు వుండడం లేదు. దీంతో వారిలో గందర గోళం నెలకొంది. పేర్లు ఎందుకు తొలగించారో తెలుసుకునే హక్కు ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు ఓటర్లకు వుంది. కానీ ఇక్కడ అది ఉల్లంఘించబడుతోంది.

బాధితులు హిందూ శరణార్ధులే : సీపీఐ(ఎం) నేత కాంతి గంగూలీ వ్యాఖ్యలు
సర్‌కు తాను అనుకూలమేనని, అయితే ఇది చాలా పెద్ద సవాలుగా మారిందని సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాంతి గంగూలీ (82) వ్యాఖ్యానించారు.ఈ ప్రక్రియను మరింత సజావుగా, ఎలాంటి అవకతవకలు లేకుండా కచ్చితంగా సాగించాలంటే మరింత సమయం కేటాయించాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు నెలల్లో పూర్తి చేయడానికి బదులుగా సుదీర్ఘకాలంలో అమలు చేయాల్సి వుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న ఈ ప్రక్రియ వల్ల అధికంగా ప్రభావం పడేది హిందూ శరణార్ధులపైనే అని అన్నారు. వారంతా బంగ్లాదేశ్‌ నుంచి పారిపోయి పశ్చిమ బెంగాల్‌లో స్థిరపడిన హిందువులేనన్నారు.

శుక్రవారం నాడు ఆయన డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి వుంది.భారతదేశం చాలా పెద్ద దేశమని, జనాభా ఎక్కువని, ఇటువంటి చోట్ల ఓటర్ల జాబితాను మరింత మెరుగైన రీతిలో సవరించాలంటే మరింత సమయమివ్వక తప్పదన్నారు. ”నేను సుందర్‌బన్స్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న హిందువులు పెద్ద సంఖ్యలో వున్నారు. తాజా ప్రక్రియ వల్ల ప్రభావం పడేది వారిపైనే అని అన్నారు. ఓటర్లు గందరగోళపడకుండా, తప్పుడు ఊహాగానాలు, నిర్ధారణ కాని సిద్ధాంతాలు ప్రచారమవకుండా వుండేలా ఎన్నికల కమిషన్‌ సక్రమ మార్గదర్శకాలు జారీ చేయాలని గంగూలీ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -