Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల జీవితాల్లో మార్పు లేదు

ప్రజల జీవితాల్లో మార్పు లేదు

- Advertisement -

రాష్ట్రంలో తిరోగమన పాలన : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏండ్లు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి కానీ కాంగ్రెస్‌ పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన బీఆర్‌ఎస్‌ డైరీ, నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని చెప్పారు. చలికాలంలోనూ గంటల తరబడి వరుసలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి ఉందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని అన్నారు. తెలంగాణ కోసం కేంద్రంతోనూ, సమైక్య వాదులతోనూ 14 ఏండ్లు పోరాటం చేశామని గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి పోరాటంలోనూ కార్యకర్తలు బలంగా భాగస్వాములయ్యారని వివరించారు. లగచర్లలో గిరిజనులపై దాడులు జరిగాయనీ, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారనీ, రైతుబంధును రెండుసార్లు ఎగ్గొట్టారనీ, ఆరు గ్యారంటీలు, 420 హామీలపై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో జరిగిన దాష్టీకానికి వ్యతిరేకంగా, హెచ్‌సీయూ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా నిలిచిన వారిని కేటీఆర్‌ అభినందించారు. గెలుపోటములు సహజమనీ, ప్రజల గుండెల్లో కేసీఆర్‌, గులాబీ జెండా స్థానం శాశ్వతమని అన్నారు.

ఈ ఏడాది పోరాటాన్ని కొనసాగిస్తూనే పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా అవసరమని చెప్పారు. పోరాటం, నిర్మాణం రెండింటి ఆధారంగా ముందుకు సాగాలని కోరారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా బీఆర్‌ఎస్‌ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. 2028లో కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బలను పట్టించు కోకుండా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌, మాజీమంత్రులు మహమూద్‌ అలీ, జి జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, తుల ఉమ, దేవీప్రసాదరావు, రాకేశ్‌, కిశోర్‌గౌడ్‌, విజరుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -