Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌రెడ్డి

అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌రెడ్డి

- Advertisement -

టీఎంసీల కొద్దీ అవాస్తవాలు… క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం : మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. నటనకు ఇచ్చినట్టు అబద్ధాలకు ఆస్కార్‌ అవార్డు ఇస్తే రేవంత్‌రెడ్డినే అందరూ ఎంపిక చేస్తారని తెలిపారు. ఆయన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బేసిన్లపై బేసిక్‌ నాలెడ్జీ ఆయనకు లేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బచావత్‌ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు తెడా తెలియదని ఎద్దేవా చేశారు. సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించం అని ఒకవైపు చెప్తూనే కసబ్‌తో పోల్చుతావా?అని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి నాలుగు కోట్ల మంది ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి కాంగ్రెస్‌ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆయన్ను కసబ్‌తో పోల్చిన సీఎంకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదని తెలిపారు.

ఆయనకు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, తనను ఉరి తీయాలనీ, రాళ్లతో కొట్టాలనీ అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని ఆయన మాట్లాడ్డం సమంజసం కాదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అవుతోలు కప్పుకున్న తోడేలు అని విమర్శించారు. గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజమైతే ఢిల్లీ సమావేశానికి ఎందుకెళ్లారని ప్రశ్నించారు. కమిటీ ఎందుకు వేశారనీ, అది ప్రజలకు వెల్లడించకుండా రహస్యంగా ఎందుకు దాచారని అడిగారు. కమిటీ వేయడమంటేనే ఏపీ జలదోపిడీకి తలుపులు తెరవడమని తెలిపారు. దీనిపై కేంద్రం స్పందిస్తే సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీలకు డీపీఆర్‌ పంపి ఏడు అనుమతులను బీఆర్‌ఎస్‌ తెచ్చిందని వివరించారు. ఈ రెండేండ్లలో కాంగ్రెస్‌ ఒక్క అనుమతి తేలేదనీ, డీపీఆర్‌ వెనక్కి వచ్చేలా చేసిందని తెలిపారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -