రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్
నవతెలంగాణ – కంఠేశ్వర్
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యాంసుందర్ అగర్వాల్ వివరాలు తెలుపుతూ.. ఈనెల శుక్రవారం 9వ జనవరి 2026 న ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు స్థానిక బోధన్ బస్టాండ్ కిల్లా రోడ్ వద్ద గల రోటరీ కృత్రిమ కేంద్రం (రోటరీ కార్యాలయం) నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాలాకుల, సంయుక్త కోఆర్డినేటర్ గా రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు సతీష్ షాహ వైద్య శిబిర వివరాలు తెలుపుతూ ఈనెల ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ, ఎముకల వైద్య నిపుణులు, గైనకాలజీ విభాగం, చెవి ,ముక్కు ,గొంతు సమస్యలు కంటి సమస్యలు, పిల్లల సమస్యలు, పలమనాలజీ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిజామాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని తెలిపారు.
రానున్న రోజులలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రతివారం డైలీ క్లినిక్ రూపంలో ఈ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని వీటిని మొదటగా మెగా శిబిరం ద్వారా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ పత్రికా సమావేశంలో క్లబ్ కార్యదర్శి గోవింద్ జవహర్ కోశాధికారి జుగల్ జాజు, మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రావు, వి శ్రీనివాసరావు, డాక్టర్ అంకిత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.



