– కొబ్బరి క్షేత్రం జియో ట్యాగ్ తప్పనిసరి
– సాగు పెరిగితేనే ప్రాంతీయ కార్యాలయం
– సీడీ బీ డీడీ డాక్టర్ మంజునాథ్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది నుండి కొబ్బరి సాగు విస్తీర్ణం పెంపుదలకు కేంద్రప్రభుత్వం రైతులకు రాయితీలు పెంపుదల చేసిందని, ఈ రాయితీలు పొందాలంటే కొబ్బరి క్షేత్రం జియో ట్యాగ్ తప్పనిసరి చేసారని సీడీ బీ ( కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ – కొబ్బరి అభివృద్ధి మండలి) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ రెడ్డి తెలిపారు. కొబ్బరి అభివృద్ధి మండలి తెలంగాణ విభాగం ఆద్వర్యంలో శుక్రవారం కొబ్బరి సముదాయం సాధికారత కార్యక్రమాన్ని స్థానిక కాసాని పద్మ శేఖర్ గార్డెన్ లో కొబ్బరి రైతు తలశిల ప్రసాద్ అద్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో కొబ్బరి సాగు మరింత పెరిగితేనే ఇక్కడ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు అవుతుందని, అందుకోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రైతులకు మండలి అమలు చేసే పధకాలను, కొబ్బరి సాగు విస్తీర్ణం నిబంధనలను, న్యూక్లియస్ కొబ్బరి విత్తనాల తోట స్థాపన, చిన్న కొబ్బరి నర్సరీల స్థాపన, కేరా సురక్ష భీమా పధకం లాంటి అంశాలను రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొబ్బరి అభివృద్ది మండలి అధికారులు ఏడీ రఘుతన్, డీఓ శరత్ హెచ్ ఎన్, హెచ్ఈఓ ఈశ్వర్ లు, రైతులు తుంబూరు మహేశ్వర రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, తుమ్మ రాంబాబు, ఆళ్ళ నాగేశ్వరరావు, పసుపులేటి ఆదినారాయణ, సీమకుర్తి వెంకటేశ్వరరావు, కాసాని పద్మ శేఖర్ లు పాల్గొన్నారు.



