Saturday, January 3, 2026
E-PAPER
Homeకరీంనగర్క్షేత్రస్థాయిలో కూలీలకు నష్టం కలగకుండా చూడాలి

క్షేత్రస్థాయిలో కూలీలకు నష్టం కలగకుండా చూడాలి

- Advertisement -

జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి మదన్ మోహన్ 
ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ అసిస్టెంట్ విధుల నుంచి తొలగింపు

నవతెలంగాణ-రాయికల్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మదన్‌మోహన్ ప్రారంభించారు. మండలంలోని 32 గ్రామాల్లో గత వారం రోజులుగా సామాజిక తనిఖీ బృందాలు ఉపాధి హామీ పథకం పనితీరు, నిధుల వినియోగంపై తనిఖీలు నిర్వహించి, ప్రజావేదికలో నివేదికలను చదివి వినిపించారు.

ఈ తనిఖీల్లో పలు గ్రామాల్లో మస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడం, సంతకాలు లేకుండానే వేతనాలు చెల్లించడం వంటి లోపాలు బయటపడినట్లు తెలిపారు. ఈ విషయంలో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు కొంత మేరకు నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. కూలీలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, వేతనాల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

లేబర్ బడ్జెట్‌కు అనుగుణంగా పనుల నిర్వహణకు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని, నర్సరీల్లో మొక్కల పెంపక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కలిపి రూ.19,464, టెక్నికల్ అసిస్టెంట్లపై రూ.8,008, కంప్యూటర్ ఆపరేటర్లపై రూ.1,898, ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌పై రూ.500 రికవరీ ఫైన్ విధించినట్లు వెల్లడించారు. పనుల కొలతల్లో తప్పులు చేసిన టెక్నికల్ అసిస్టెంట్ రామును విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంబుడ్స్‌పర్సన్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో బింగి చిరంజీవి, డీఆర్‌డీఏ విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్‌రెడ్డి, స్టేట్ రిసోర్స్ పర్సన్ దేవేందర్, ఎంపీఓ సుష్మ, ఏపీఎం దివ్య, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -