చండీగఢ్‌తో హైదరాబాద్ ఢీ నేడు
విజయ్ హజారే ట్రోఫీ 2025
రాజ్‌కోట్ : ఈ ఏడాది దేశవాళీ సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆడుతున్న హైదరాబాద్ ఇప్పటివరకు గ్రూప్ దశలో ఒక్క విజయం సాధించలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎలైట్ సూపర్ లీగ్ దశకు చేరుకున్న హైదరాబాద్ తృటిలో ఫైనల్లో చోటు చేజార్చుకుంది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ గ్రూప్ దశలో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ తేలిపోయింది. ఉత్తరప్రదేశ్, విదర్భ, అస్సాం, బరోడా చేతిలో దారుణ పరాజయాలు చవిచూసింది. నాకౌట్ ఆశలు ఆవిరి చేసుకున్న హైదరాబాద్.. ఇప్పుడు గ్రూప్ దశలో ఆఖరు స్థానంలో నిలువకుండా చూసుకోవాలి. గ్రూప్ దశ ఐదో రౌండ్‌లో నేడు చంఢగీడ్‌తో హైదరాబాద్ తలపడుతుంది. చంఢగీడ్ సైతం తొలి నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైంది. గ్రూప్‌లో హైదరాబాద్ 7, చంఢగీడ్ 8వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.
పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్న మ్యాచ్‌లో ఓ జట్టు కచ్చితంగా తొలి విజయం సాధించటం లాంఛనమే. మరి, హైదరాబాద్ ఈ మ్యాచ్‌లోనైనా మెరుస్తుందా? లేదా చూడాలి. తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ సింగ్,ఆ తర్వాతి మ్యాచ్‌లకు సివి మిలింద్ కెప్టెన్సీ వహించగా… జట్టు ప్రదర్శనలో ఎటువంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్ సీనియర్ ఆటగాడు, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ నాలుగు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. అయినా, తుది జట్టులో అతడి చోటుకు ఎటువంటి ఢోకా లేదు. అభిరాత్ రెడ్డి, రాహుల్ సింగ్, వరుణ్ గౌడ్‌లు మెరుస్తున్నా… ధాటిగా పరుగులు సాధించటంలో విఫలం అవుతున్నారు. తన్మయ్ అగర్వాల్, సివి మిలింద్ బంతితో మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంది. గతంలో రంజీ ట్రోఫీలో ప్లేట్ గ్రూప్‌కు పడిపోయిన హైదరాబాద్.. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్లేట్‌కు పడిపోకుండా ఉండేందుకు చివరి మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది.



