యాషెస్ సిరీస్ తర్వాత
ఆసీస్ ఆటగాడి అల్విదా
సిడ్నీ: ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం నుంచి మొదలయ్యే ఐదో టెస్టు తనకు ఆఖరిదని ఖవాజా స్పష్టం చేశాడు. శుక్రవారం పలు మీడియా సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖవాజ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న జాతి వివక్షను ప్రధానంగా పేర్కొన్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ సంతతి ముస్లింగా అనేక సందర్భాల్లో మాజీ క్రికెటర్లకు లక్ష్యంగా మారాని చెప్పుకొచ్చాడు. ‘జట్టులో మిగతా ప్లేయర్లతో పోలిస్తే నన్ను భిన్నంగా చూసేవారు. కెరీర్ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాను. దీనకంతటికి నేను పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం కావడం కారణం. ఇంగ్లండ్‌తో పెర్త్ టెస్టుకు ముందు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాను. దీంతో ఓపెనింగ్ కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాను. కానీ ఈ విషయాన్ని మీడియా చాలా వక్రీకరించింది.
మ్యాచ్‌కు ముందు గోల్ఫ్ ఆడిన కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు పలువురు మాజీ క్రికెటర్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నా జీవితంలో చాలా వరకు ఇలాంటి జాతివివక్షను ఎదుర్కొన్నాను. కానీ మిగతా ప్లేయర్లు మాత్రం మ్యాచ్‌లకు ముందు గోల్ఫ్ ఆడటం, ఫుల్‌గా తాగినా వాళ్లపై ఎలాంటి దాడి ఉండదు. ఇందుకు నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. సిరీస్ మొదలైనప్పుడే ఇదే ఆఖరిదని భావించా. ఇన్ని రోజులు ఆసీస్‌కు ఆడినందుకు గర్వంగా ఉంది’ అని అన్నాడు. ఖవాజా తన కెరీర్‌లో ఆసీస్ తరఫున 87 మ్యాచ్‌లాడి 43.39 సగటుతో 6206 పరుగులు చేశాడు. ఇందులో 16సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు 40వన్డేలు, 9 టీ20ల్లోనూ ఖవాజా ఆడాడు.



