దంపతులు కలిసి జీవిస్తేనే గ్రీన్‌కార్డు
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్‌స్టీన్
వాషింగ్టన్ : వలసదారుల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగా కఠిన నిబంధనలను తీసుకొస్తున్నది. ఈ తరుణంలో అమెరికన్ గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే విషయంలో జాగ్రత్తలు, పూర్తి అవగాహన అవసరమని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతినిచ్చే ‘గ్రీన్‌కార్డు’ పొందడం ఇప్పుడు మరింత కష్టంగా మారన్నుది. గతంలో అమెరికన్ పౌరులను వివాహం చేసుకోవడం ద్వారా సులభంగా గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుత డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఈ నిబంధనలను కఠినతరం చేసింది. కేవలం కాగితాల మీద పెండ్లి జరిగితే సరిపోదనీ, భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తేనే గ్రీన్ కార్డు దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ మేరకు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్నస్టీన్ స్పందించారు. ”మీరు బంధంలో ఉన్నంత మాత్రాన గ్రీన్‌కార్డు రాదు, కలిసి నివసిస్తేనే వస్తుంది” అని తెలిపారు. ఉద్యోగం, చదువు, ఇతర వ్యక్తిగత కారణాలతో దంపతులు వేర్వేరు ఇండ్లలో నివసిస్తే అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ఆ దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉందని వివరించారు. కేవలం ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే పెండ్లి చేసుకున్నారా? అనే కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారని వివరించారు. దంపతులు ఒకే చిరునామాలో ఉన్నారా? లేదా? అనే విషయం పైనే కాకుండా, వారి మధ్య ఉన్న బంధం ఎంత వరకు నిజాయితీతో కూడుకున్నదనేది కూడా అధికారులు అంచనా వేస్తారని తెలిపారు.
ఇంటి తలుపు తట్టి మరీ విచారణ చేసే అవకాశాలున్నాయనీ, కాబట్టి విడిగా ఉండే దంపతులు దరఖాస్తు చేసుకునే ముందు న్యాయ సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసదారులు, కొన్ని దేశాలే టార్గెట్‌గా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ కార్డ్ హౌల్డర్లపై ఆయన దృష్టి పెట్టారు. గతంలో ‘ఆందోళనకర దేశాలు’గా గుర్తించిన 19 దేశాలకు చెందిన శాశ్వత నివాసితుల గ్రీన్‌కార్డులను సమగ్రంగా సమీక్షించాలని ఆయన ఆదేశించారు. దీంతో పాటు గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారుల పని అనమతి కాలాన్ని 18 నెలలకు కుదించారు. ఇప్పటికే ఏటా 50 వేల మందికి వీసాలు ఇచ్చే డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రభుత్వం నిలిపివేసింది.



