Saturday, January 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూసీ కంటే సీఎం మాటల కంపే ఎక్కువ

మూసీ కంటే సీఎం మాటల కంపే ఎక్కువ

- Advertisement -

ముందు ముఖ్యమంత్రి నోరు ప్రక్షాళన చేయాలి
స్పీకర్‌ది ఏకపక్ష వైఖరి, ప్రభుత్వానిది అప్రజాస్వామిక ధోరణి
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం : బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల కంపే ఎక్కువగా ఉన్నదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళన కాదనీ, ముందు సీఎం నోరు ప్రక్షాళన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిరసనగా ఈ దఫా అసెంబ్లీ సమావేశాలను బీఆర్‌ఎస్‌ పార్టీ బహిష్కరిస్తోందని ప్రకటించారు. శుక్రవారం స్పీకర్‌ ఏకపక్షంగా సభను నడుపుతున్న తీరుకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక, అసభ్యకర ప్రవర్తనకు తీరుకు నిరసనగా అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. బీఏసీ సమావేశానికి తమను గంటన్నర సేపు ఆపి అవమానించారని చెప్పారు. సభను ఏడు రోజుల పాటు నడపాలనీ, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్‌ నిర్ణయించాలని స్పష్టంగా అనుకున్నామని గుర్తు చేశారు. కానీ సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్‌ నిర్ణయానికే వదిలేస్తున్నామని తప్పుడు సమాచారం పొందుపరిచారని వివరించారు. స్పీకర్‌ సభను కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారని అన్నారు.

మోడీని రాహుల్‌ విమర్శించడం లేదా?
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని హరీశ్‌రావు చెప్పారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలుంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తమ మైక్‌ కట్‌ చేశారని అన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని మోడీని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించడంలేదా? ఇక్కడ తాము సీఎంను ప్రశ్నిస్తే మైక్‌ ఎందుకు ఆపేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని విమర్శించొద్దని స్పీకర్‌ తమకు చెప్పడం ఎక్కడి పద్ధతని అడిగారు. ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకనీ, తమను ఎందుకు పిలిచినట్టని అన్నారు. సభలో సీఎం రేవంత్‌రెడ్డి బాడీ షేమింగ్‌ చేస్తూ మాట్లాడుతున్నారనీ, ముఖ్యమంత్రిలా కాకుండా వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీని సీఎల్పీ సమావేశంలా, గాంధీభవన్‌లాగా మార్చేశారని విమర్శించారు.

సభలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్టే సొల్లు వాగుడు వాగుతున్నారని అన్నారు. కేసీఆర్‌ గురించి అడ్డగోలుగా మాట్లాడటం సరైంది కాదన్నారు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి వాడిన భాషను తీవ్రంగా ఖండించారు. మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాలను మల్లన్న సాగర్‌ నుంచి తెస్తున్నారా?అని అడిగితే దానికి సమాధానం చెప్పలేదన్నారు. రాహుల్‌ గాంధీ దేశంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. అవినీతికి అధికారికంగా రేట్లు పెట్టి మరీ పెంచిన రేవంత్‌ రెడ్డికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సభలో సభ్యులందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

నేడు తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కృష్ణా, గోదావరి నదీ జలాలపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు హరీశ్‌రావు చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఈనెల ఒకటిన ప్రజాభవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి రంగంలో వచ్చిన మార్పులు, పెరిగిన ఆయకట్టు, వ్యవసాయ పురోగతి, ఆహార ధాన్యాల దిగుబడి పెంపు వంటి వివరాలను ప్రజల ముందు ఉంచనున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం గురించి ప్రస్తావించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -