పియ్రమైన వేణు గీతికకు
నాన్న.. నువ్వు ఇక్కడ ఉన్నని రోజులు చాలా ఆనందంగా గడిచిపోయింది. సెలవులు అయిపోయి తిరిగి వెళ్లిపోయావు. ఏమిటో మనసంతా గజిబిజిగా ఉంది. ఉద్యోగ బాధ్యతలు తప్పవు కదా! అందుకే పుట్టినరోజు వరకు ఉండమని అనలేక పోయాను. రేపటి నుండి నీ బిజీలో నువ్వు ఉంటావు. జాగ్రత్తగా ఉండు నాన్న.
నాన్న గత కొన్ని వారాలుగా నీకు సైబర్ క్రైం గురించి చెప్తూ వచ్చాను. ఈ సారి సహజీవనం గురించి చెప్తాను. సహజీవనం అనేది నేడు చాలా సాధారణం అయిపోయింది. ఇష్టపడిన ఇద్దరూ కలిసి జీవించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే దీని వల్ల కొన్ని నష్టాలు ఉంటున్నాయి. వాటిని యువత అర్థం చేసుకోలేకపోతున్నారు.
నేను చాలా మందిని చూసాను, చూస్తున్నాను. కలిసి ఉన్నా కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ, బాధ్యత లేకపోవడం. ఇవి లేనప్పుడు ఎందుకు కలిసి ఉండాలి అనుకోవడం ఒకరిని ఒకరు దూషించుకోవడం, తప్పులు వేదకడం చేస్తుంటారు. ఇవి పెండ్లి చేసుకున్న జంటల్లోనూ ఉంటాయి. నేను ఈ మధ్య పేపర్లో చూసాను. సహజీవనం చేస్తున్న అమ్మాయికి ఒక కూతురు పుట్టింది. అతనికి అంతకు ముందే పెండ్లి అయ్యింది. పెండ్లి అయిన వ్యక్తి ఏం మాయమాటలు చెప్పి ఆమెతో సహజీవనం మొదలుపెట్టాడో. అయితే ఈ అమ్మాయి గత కొద్దిరోజులుగా ‘నీ భార్యకు విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకో’ అని గొడవ మొదలు పెట్టింది. అప్పటి నుండి అతను మాట దాటేయడం, ఏదో ఒక వంకతో దూరంగా ఉండటం చేస్తున్నాడు.
కొన్నాళ్లకు వారి మధ్య ఏం జరిగిందో కానీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంది. తండ్రి ఉండి కూడా ఒక బిడ్డ అనాథ అయింది. ఇప్పుడు తల్లి కూడా లేదు. ఇలాంటివి మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి. మనం ఒకరితో కలిసి ఉండాలనుకున్నప్పుడు వారు ఎలాంటి వారో ముందే కనీస అవగాహన ఉండాలి. అప్పటికే పెండ్లి జరిగి భార్య ఉన్న వ్యక్తితో సహజీవనం చేయడం వల్ల ఇలాంటి సమస్యలే వస్తాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఇటువంటి వాటిపై అవగాహన కల్పించాలి. దీనివల్ల కలిగే నష్టాల గురించి చెప్పాలి. ఇటువంటి రిలేషన్స్‌కు దూరంగా ఉండాలి. ఎదుటి వాళ్లు తమ అవసరాల కోసం ఎన్ని మాటలైనా చెబుతారు. కానీ మనం చేస్తుంది మంచా చెడ్డా అనే నిర్ణయం తీసుకోవల్సింది మనమే. సరే నాన్న ఉంటాను.. జాగ్రత్త…
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



