Wednesday, January 7, 2026
E-PAPER
Homeమానవిఆకులపై అద్భుత చిత్రాలు

ఆకులపై అద్భుత చిత్రాలు

- Advertisement -

నైపుణ్యం అనేది ఒకరి సొత్తు కాదు. నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ దాన్ని ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. అలాగే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తోంది కల్లెం ధనుజ. తన ఆలోచనలను ప్రకృతిలో దొరికే ఆకులపై ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన నైపుణ్యంతో అందమైన చిత్రాలతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. లీఫ్‌ ఆర్ట్‌తో పాటు పెయింటింగ్‌, ఎస్సే రైటింగ్‌, గానం వంటి పలు రంగాల్లో రాణిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇలా ప్రకృతినే కాన్వాస్‌గా మార్చిన యాదాద్రి యువతి పరిచయం నేటి మానవిలో…

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన కల్లెం సాయిలు, పార్వతమ్మ దంపతుల బిడ్డ కల్లెం ధనుజ. నిరుపేద కుటుంబంలో పుట్టినా, ప్రతిభకు పేదరికం అడ్డుకాదని తనలోని నైపుణ్యంతో నిరూపించింది. చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఆమె చదువుతో పాటు కళలపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుంది.

కరోనా కాలమే కళకు కొత్త దారి
ప్రస్తుతం నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ధనుజ, ఉపాధ్యాయ వృత్తితో పాటు తనలోని కళాకారిణిని మరింత మెరుగు పరుచుకుంటోంది. ‘ఏదైనా కొత్తగా కనిపిస్తే దాన్ని కళారూపంలో తీర్చిదిద్దాలనే తపన చిన్నప్పటి నుంచే ఉంది’ అని ఆమె చెబుతుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌లో లీఫ్‌ ఆర్ట్‌ కళాకారుడు గుండు శివకుమార్‌ నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయిన ధనుజ తను కూడా ఆ కళను నేర్చుకోవాలనుకుంది. అనుకున్న వెంటనే దాన్ని ఆచరణలో పెట్టింది. పట్టుదలతో లీఫ్‌ ఆర్ట్‌ నేర్చుకుంది.

చెట్టు ఆకులపై…
తొలుత కాలుగచెట్ల ఆకులపై చిన్న చిన్న డిజైన్లు, పేర్లు రాయడం ప్రారంభించింది. ఆ తర్వాత రావిచెట్టు ఆకులపై స్వాతంత్య్ర సమరయోధులు, దేవుళ్లు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ముఖచిత్రాలను అద్భుతంగా చెక్కడం నేర్చుకుంది. అలాగే బర్త్‌డేలు, మ్యారేజ్‌డేలు, ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా ఆకులపై చిత్రాలు వేసి సంబంధిత వ్యక్తులకు బహుమతిగా పంపిస్తోంది. ఇప్పటివరకు వందకు పైగా లీఫ్‌ ఆర్ట్‌ చిత్రాలు రూపొందించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

కుటుంబమే నా బలం
తన విజయానికి కుటుంబ ప్రోత్సాహమే ప్రధాన కారణమని ధనుజ గర్వంగా చెబుతుంది. ముఖ్యంగా తన అక్క ధర్మమణి తన బ్యాక్‌బోన్‌ అంటుంది. ‘వితౌట్‌ హర్‌ ఐ ఆం నథింగ్‌. చిన్నప్పటి నుంచి ప్రతి రంగంలో ముందుండాలని మా అక్క నన్ను నిత్యం ప్రోత్సహించింది. అవసరమైన సామగ్రి అందిస్తూ, నా ఆలోచనలకు బలం ఇచ్చింది’ అంటూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

విద్యలోనూ శిఖరం
కళల్లోనే కాదు విద్యారంగంలోనూ ధనుజ అసాధారణ ప్రతిభ కనబరిచింది. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీజీ (తెలుగు) పూర్తి చేసి, యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం అందుకుంది. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగిన 23వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ చేతుల మీదుగా ఈ గోల్డ్‌ మెడల్‌ను స్వీకరించింది. 2021లో ఈ ఘనత సాధించగా, ఆమె విజయం జిల్లాకే గర్వకారణంగా నిలిచింది.

మహిళలకు సందేశం
‘పట్టుదల ఉంటే ఆడపిల్లలు ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. అవకాశం కోసం ఎదురు చూడకుండా, మనలోని ప్రతిభను మనమే వెలికితీయాలి’ అని ధనుజ యువతకి పిలుపునిస్తోంది. లీఫ్‌ ఆర్ట్‌తో పాటు మరిన్ని కళారంగాల్లో తన ప్రయాణాన్ని మరింత విస్తరించాలని, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే ఈ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆమె ఆకాంక్ష. గ్రామస్తులు కూడా ధనుజలాంటి ప్రతిభావంతులను గుర్తించి ప్రభుత్వాలు చేయూతనివ్వాలని కోరుతున్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ, కళను సాధనగా చేసుకుని, విద్యను ఆయుధంగా మలుచుకున్న కల్లెం ధనుజ నేటి యువతికి నిజమైన ఆదర్శం.

  • గడగోజు రవీంద్రాచారి, 9848772232
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -