బంగారక్క : ఏంది మావా.. నీవు, జుట్టుపోలుగాడు కలిసి బజారుకి పోతిరి కదా. నీవొక్కడివే తిరిగొస్తున్నవేంది? ఆడేడి?
కేతిగాడు : అదో కథలే అమ్మీ.. వాడి బాధ చూసి నాక్కూడా ఏడుపొస్తుంది.
బంగారక్క : ఏం జరిగిందేంటి?
కేతిగాడు : మేమిద్దరం కూరగాయల మార్కెట్టుకి పోయామో లేదో… ఓ పెద్దావిడ వాడి (జుట్టుపోలుగాని) జుట్టెట్టుకుని బరాబరా లాక్కుటూ పోయి. ఇదిగోఇటు చూడు మేమంతా నీవు చెప్పినట్టు సాంప్రదాయంగా చీరాజాకెట్టు కట్టుకుని పద్ధతిగా కూరగాయలు అమ్ముకుంటున్నాం. ఏది మా కాళ్లకు మొక్కు అంటూ వరుసగా అందర్ని నిలబెట్టింది. వాడక్కడ వాళ్లందరి కాళ్లు మొక్కేపనిలో వున్నాడు.
బంగారక్క : తిక్క కుదిరింది. లేకపోతే ప్రతోడు ఆడోళ్లకు సలహా ఇచ్చేవాడే. ‘నోరా.. వీపుకు చేటు తేమాకే’ అన్న సామెతలు ఊరకే రాలా.
కేతిగాడు : బంగారక్కా నాకు తెలియక అడుగుతాను. వాడు అన్నదాంట్లో తప్పేముంది?
బంగారక్క : పైకి పెద్ద తప్పుగా కన్పించదు. వాడి భాషలోనే చెప్తా.. కాస్త అర్థం చేసుకో. వాడి జుట్టును చూసి నీకా పిలకెందుకు? బోడిగుండు చేసుకోవచ్చుగా.. నీకా పంచె గోచీ ఎందుకు? ప్యాంటు షర్టు వేసుకోవచ్చుగా. ఊరంతా తిరుగుతావేంది? బొచ్చుకన్పడేలా? అని ఎవర్నైనా అంటే వాళ్లకి కోపం రాదా.. వస్తుంది. అది వారిష్టం. పర్సనల్. అందులో వారి స్వాభిమానం వుంటుంది. అది మరచి నేను మగాడ్ని కాబట్టి ఆడోళ్లకు నీతులు చెప్తాను అంటే అస్సలు కుదరదు. పైగా వేషభాషలు ప్రాంతం ప్రాంతానికి, కాలం కాలానికి మారుతుంటాయనే సోయి లేకపోతే ఎలా..?
కేతిగాడు : అంతేనంటావా?
బంగారక్క : అంతకాకపోతే ఏముంది? వీళ్లు ఇలాగే వుండాలి. ఇవే తినాలి. ఇలాగే బతకాలి అని నిర్ణయించడానికి వీళ్లెవరు? దాన్నే ‘మోరల్ పోలిసింగ్’ అంటారు. ఇప్పుడది కొందరిలో ఎక్కువ అవుతుంది. సాటి మనిషిని మనిషిగా చూడనివారే ఈ దుర్మార్గాలు చేస్తుంటారు.
కేతిగాడు : మరి దీనికి పరిష్కారం ఎలా?
బంగారక్క : పరిష్కారం ఒక రోజులో ఒకక్షణంలో రాదు. మైండ్ సెట్‌లో మార్పు రావాలి. ఇది దీర్ఘకాలిక మార్పు. దశాబ్దాలు, శతాబ్దాలు కూడా పట్టవచ్చు.
కేతిగాడు : నిజమా..?
బంగారక్క : నిజమే. భర్త చనిపోతే బార్యను కూడా చితిలో పెట్టి తగులబెట్టే సతీసహగమనం సాంప్రదాయం భౌతికంగా అంతమయింది గాని మానసికంగా అంతం కాలేదని అనిపిస్తుంది (బాధగా).
కేతిగాడు : ఏందమ్మీ. నీవలా వేదాంతంలోకి పోతున్నావేంది?
బంగారక్క : చూడు మావా… ఆడది మగానికి లొంగి బతకాలనే భావం సతీసహగమనంలాంటిదే కదా… స్త్రీని స్వేచ్ఛగా తన మానాన తనను బతకనివ్వరు.
కేతిగాడు : : విషయం సూటిగా చెప్పమ్మీ. నీలో నీవు బాధపడ్తే ఎలా?
బంగారక్క : ఏం చెప్పను మావా? ఈ దేశంలో న్యాయం బలహీనుల ఆక్రందనగానే మిగిలిపోతుంది.
ఉత్తర ప్రదేశ్, బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రం. ఆడపిల్లపై అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న దోషిని బెయిల్‌పై అర్థంతరంగా విడుదల చేసింది. దాంతో ఇప్పుడు ఆ పిల్ల, ఆమె తల్లి మమ్మల్ని జైల్లో పెట్టి మా ప్రాణాలు కాపాడండి. అతగాడు బయటవుంటే మా ప్రాణాలకు భద్రత వుండదు అని వాపోతున్నారు.
కేతిగాడు : అవునా అమ్మీ?
బంగారక్క : అవును. ఎనిమిదేళ్ల క్రితం ఓ దళిత మైనర్ బాలికను అక్కడి అప్పటి బిజెపి ఎమ్మెల్యే సింగార్ బలవంతంగా ఎత్తుకుపోయి అనేక పర్యాయాలు అత్యాచారం చేశాడు. అక్కడితో అగలా… ఆమెను ప్రాణం వున్న మాంసం ముద్దలా అమ్మే ప్రయత్నం చేశాడు. పారిపోతే ఆ ఎమ్మెల్యే రౌడీలు పట్టుకొచ్చి మళ్లీ మళ్లీ నరకకూపంలో పడేశారు. తమని కాపాడమని వేడుకున్నా.. పోలీసులు అతగాని పై కేసు నమోదు చేయలేదు. అలుపెరగని పోరాటంలో ఆమె తండ్రిని కోల్పోయింది. బంధువులను కోల్పోయింది. తండ్రిని రక్షించుకునేందుకు ఆమె ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాథ్ ఆఫీసు ఎదుట ఆత్మాహుతికి సైతం సిద్దపడింది. అప్పుడు దేశం యావత్తు ‘ఉన్నావ్’ బాధితురాలికి అండగా నిలబడటంతో ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయక తప్పలేదు.
కేతిగాడు : మరెలా విడుదలయ్యాడు?
బంగారక్క : అదో పెద్ద కథ. సింగార్ లాంటి అభినవ కీచకులు, వారిని సమర్థించే దుర్మార్గులు చాలామంది ఇంకా ఈ దేశంలో పాతకుపోయివున్నారు. రాజకీయ, న్యాయ రంగాల్లో కూడా ఈ పురుషాహంకార భావజాలం విషంలా కలిసిపోయింది. అందుకే చట్టంలో లొసుగులు వెతికి విడుదల చేశారు.
జుట్టుపోలుగాడు : అక్కా నేవచ్చి ఇందాకట్నించి నీ మాటలు వింటున్నాను. మనసుమార్చుకున్నా. కళ్లమ్మటి నీళ్లు ఆగటం లేదు. సుప్రీంకోర్టు అతగాడ్ని మళ్లీ జైల్లో వుంచేలా చేసింది. మనసున్న ప్రతిమనిషి నిజంగా అలా పోరాడేతల్లి పాదాలకు మొక్కాలక్కా.
– కె.శాంతారావు, 9959745723



