విద్యార్థుల విషయంలో చూస్తే, చదువే ఒక పెద్ద పెట్టుబడిగా మారిపోయింది. విదేశాల్లో చదివితే మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం వస్తుందనే నమ్మకం బలంగా వుంది. ఈ నమ్మకం కేవలం ప్రకటనల వల్ల పుట్టింది కాదు. నిజంగా చాలామంది అక్కడ చదివి స్థిరపడుతున్న ఉదాహరణలు మన కళ్ల ముందే ఉన్నాయి. అయితే అదే సమయంలో అప్పుల భారంతో, ఒంటరితనంతో, సంస్కతి ఒత్తిడితో ఒడిదుడుకులు పడుతున్న యువత కూడా తక్కువేమీ కాదు. అయినా సరే, సవాలును స్వీకరించాలనే ధైర్యమే యువతను ముందుకు నడిపిస్తోంది.
మన దేశంలోని యువతలో కూడా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే అంతిమ లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు అది ఒక్క మార్గంగా మాత్రమే మిగిలిపోయింది. ప్రైవేటు రంగం, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, డిజిటల్ వేదికలపై ఆధారపడే కొత్త ఉపాధి మార్గాలు, విదేశీ ఉద్యోగాలు… ఇవన్నీ కలిసి ఒక విస్తతమైన అవకాశాల ప్రపంచాన్ని యువత ముందు తెరలేపాయి. ఒకే జీవితాన్ని ఒకే మార్గంలో నడపాల్సిన అవసరం లేదన్న భావన యువతలో బలంగా పాతుకుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, యువత కేవలం సంపాదించడానికే కాదు, తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనే తపనతో కూడా ఈ ప్రయాణాలు చేస్తున్నారు. ఒక చిన్న పట్టణంలో పుట్టిన యువకుడికి తన ఆలోచనలకు, తన సజనాత్మకతకు, తన వినూత్న పనికి సరైన వేదిక దొరకడం కష్టం. అలాంటి వేదికలు ప్రపంచంలోని పెద్ద నగరాల్లో సులభంగా లభిస్తున్నాయి. అందుకే అక్కడికి వెళ్లి తన ప్రతిభను పరీక్షించుకోవాలనే కోరిక వారికి కలుగుతోంది.
కుటుంబాల ఆలోచనల్లో కూడా ఇక్కడ ఒక పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు పిల్లలు దూరంగా వెళ్తే తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లేవి. ఇప్పుడు అదే తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపించేందుకు అప్పులు చేసే స్థాయికి కూడా సిద్ధపడుతున్నారు. ఇది ఆశగా మారిందా, భయంగా మారిందా అనే రెండు భావాలు కలిసి నడుస్తున్న తరుణమిది. పిల్లలు బాగా స్థిరపడాలి, రేపు కష్టాలు పడకూడదు అనే కోరికతో వారు నేటి కష్టాలను మోస్తున్నారు.
అయితే ఈ ప్రపంచవ్యాప్త ఉద్యోగ ప్రయాణంలో ఒక అస్పష్టమైన ఖాళీ కూడా కనిపిస్తోంది. ఎక్కువ సంపాదన ఉన్నా, సుఖసౌకర్యాలు ఉన్నా, మనసుకు తాకే బంధాలు, భాష, సంస్కతి, స్వదేశపు వాతావరణం లాంటి వాటి కొరత చాలామందిని లోపల నుంచి వెంటాడుతోంది. వారానికి యాభై, అరవై గంటలు పనిచేస్తూ సంపాదిస్తున్న డబ్బు చేతిలో ఉన్నా, పండుగ రోజు ఒక్కడే గడపాల్సి రావడం, కుటుంబ సమస్య వచ్చినప్పుడు దగ్గర ఉండలేకపోవడం లాంటి అనుభవాలు మనుషుల్లో లోతైన ఖాళీని పెంచుతున్నాయి. అయినా సరే, ఆ ఖాళీని కూడా విజయంగా భ్రమించుకునే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది.
ప్రపంచ ఆర్థిక అస్థిరత, యుద్ధాల ప్రభావం, సాంకేతిక మార్పులు, కత్రిమ మేధస్సుల ప్రభావం… ఇవన్నీ కూడా యువత ఉద్యోగాలపై ఆలోచించే విధానాన్ని మార్చేశాయి. ఒకే నైపుణ్యంతో జీవితాంతం నడిచే కాలం పోయింది. ఇప్పుడు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే యువత దేశాలు మారడానికి కూడా సిద్ధపడుతోంది. ఎక్కడ అవకాశముంటే అక్కడికి వెళ్లిపోవడమే తార్కిక మార్గమనే భావన బలపడుతోంది.
ఇందులో మరో కోణం చూస్తే, ఇది కేవలం వ్యక్తిగత పరిణామం మాత్రమే కాదు, దేశాల మధ్య ఆర్థిక సమీకరణాల్లోనూ ఒక భాగంగా మారింది. ఒక దేశం యువతను తయారు చేస్తోంది, మరో దేశం ఆ యువత శ్రమను వినియోగించుకుంటోంది. నైపుణ్యం ఉన్న యువత బయటకు వెళ్లిపోవడం వల్ల మన దేశానికి జ్ఞాన లోపం ఏర్పడుతోందన్న వాదన ఒకవైపు ఉంటే, విదేశాల నుంచి వచ్చే సంపాదన, అనుభవం దేశ అభివద్ధికి తోడ్పడుతోందన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఇంకా పూర్తిగా ఏర్పడలేదనే చెప్పాలి.
మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా యువత ఉద్యోగాల కోసం చేస్తున్న ఈ ప్రయాణం కేవలం అధిక జీతాల కోసం మాత్రమే కాదు. అది ఒక పెద్ద జీవన మార్పు. భద్రత కోసం, గౌరవం కోసం, స్వేచ్ఛ కోసం, గుర్తింపు కోసం, తాము ఊహించుకున్న జీవితాన్ని నిజం చేసుకోవడం కోసం సాగుతున్న ప్రయత్నం. ఆ ప్రయాణంలో కొందరికి విజయం దొరుకుతోంది, మరికొందరికి అనుభవం దొరుకుతోంది, ఇంకొందరికి పోరాటమే మిగులుతోంది. అయినా ఈ తరం వెనక్కి తగ్గడం లేదు. ఒకేచోట నిలబడడం కన్నా, తెలియని దారిలోనైనా అడుగు వేయడానికే సిద్ధపడుతోంది. ఇదే ఈ సమకాలీన యువత ఆలోచనా ధోరణి. ఇదే ఈ కాలం మన ముందుంచుతున్న గాఢమైన వాస్తవం.
ఈ మొత్తం పరిణామాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచం కేవలం డబ్బు వెంట పరుగెత్తే దశను దాటేసి, నిలకడైన జీవనాన్ని వెతుక్కునే సంధికాలంలో నిలబడి ఉంది. సంపాదన అవసరమే కానీ అదే జీవిత లక్ష్యంగా మారితే మిగిలేది అలసట, ఒత్తిడి, ఖాళీ మాత్రమే అన్న సత్యం నెమ్మదిగా అనుభవంలోకి వస్తోంది. అందుకే ఇక ముందు యువతకు, సమాజానికి అవసరమయ్యే దారి ఒక్కటే… నైపుణ్యాన్ని సంపాదనతో మాత్రమే కొలవకుండా, జీవన విలువలతో కూడా తూకం వేయడం. ఉద్యోగాలను సష్టించే వ్యవస్థలు మానవ గౌరవాన్ని కేంద్రంగా పెట్టుకోవాలి, ప్రభుత్వాలు యువతకు స్థిరత్వం ఇచ్చే విద్యా విధానాలు, ఉపాధి విధానాలు రూపొందించాలి. కుటుంబాలు పిల్లలపై కేవలం ఆదాయ భారం మోపకుండా వారి మనసు ఒత్తిడిని కూడా గుర్తించాలి. విదేశాలకు వెళ్లినా, దేశంలోనే ఉన్నా, పని అనేది జీవనానికి దాసోహం కావాలి కానీ జీవితం ఱ్‌రవశ్రీట పనికి బలి కాకూడదు అనే దష్టిని పెంచుకోవాలి. పొదుపు, పెట్టుబడి, భీమా, ఆరోగ్య భద్రత లాంటి వాటికి జీవితంలో స్థానం ఇచ్చే అలవాట్లు చిన్న వయసులోనే అలవరుచుకోవాలి. గ్రామీణ యువతకు స్థానిక ఉపాధి అవకాశాలను బలోపేతం చేయగలిగితే వలసలు తగ్గుతాయి, కుటుంబ బంధాలు నిలుస్తాయి, సమాజం బలపడుతుంది. నగరాల్లో పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం పాటించే సంస్కతి పెరగాలి. దేశాలు పరస్పరం యువత శ్రమను మాత్రమే కాదు, జ్ఞానాన్ని, విలువలను కూడా మార్పిడి చేసుకునే స్థాయికి ఎదగాలి. అప్పుడే ఈ ప్రపంచ ఆర్థిక పరుగులో మనిషి మనిషిగానే మిగులుతాడు. అప్పుడే సంపాదన జీవనాన్ని నడిపించే సాధనంగా ఉంటుంది, జీవితం సంపాదనకు బానిసగా మారదు. ఇదే ఈ కాలం మన ముందు ఉంచిన అసలైన పరిష్కార మార్గం, ఇదే రేపటి భద్రమైన భవిష్యత్తుకు దారి చూపే వెలుగు.
చిటికెన కిరణ్ కుమార్, 9490841284



