వాక్యాలను విరిచి పాదాలుగా మలిచి యిదే కవిత్వం అని నమ్మిన ప్రాథమిక తనంలోంచి బయటపడటం మామూలు విషయం కాదు. అధ్యయనం పెరుగుతున్న కొద్దీ కవిత్వంపై కమ్ముకున్న మాయా మేఘాలు దూరమవడం చూస్తూ కేరింతలు కొట్టే దశకు చేరుకోవడం మంచి పరిణామం. పద్యంతో మొదలైన ప్రయాణం వ్యాకరణాన్ని శ్వాసించిన కాలంలోంచి సరళ వచన రూపంలో కవిత్వమవుతున్న నేటి కాలంలోకి పరకాయ ప్రవేశం చేయడం అందరికీ సాధ్యం కాదు. దుందుడుకు ప్రాయంలోనే ‘మెరుపులు’ పేరుతో సరికొత్త లఘు కవితాప్రక్రియకు ప్రాణం పోసిన దశ నుంచి వచన కవిత్వం వైపు దష్టిని మరల్చిన కవి ‘తాండ్ర చిరంజీవి’ని చూస్తుంటే కవిగా పరిణామం చెందుతున్న దశ తారసపడి పలకరిస్తది. ఎయిడెడ్ పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా సేవలందిస్తూ విద్యార్థులను సాహిత్యం వైపు అడుగులు వేయించే బహత్ కార్యానికి పాదులు వేస్తున్నందుకు మనసారా హత్తుకుంటాం.
‘వస్తువు -వైయక్తికం’ నుంచి ‘సామాజికం’ కావడమే కవిగా తన స్థానాన్ని పదిలపర్చుకునేలా చేసింది. సామాజిక స్పహతో, బాధ్యతతో అకుంఠిత దీక్షతో కవితా యజ్ఞాన్ని నిరాటంకంగా సాధన చేస్తున్న క్రమాన్ని పరిశీలిస్తే ఎదిగిన కొడుకు చేతికి అందివస్తడనే నాయిన నమ్మకం లాంటి భరోసా వాక్యం అనిపిస్తది. అమ్మ, నాన్న, గురువు, చెట్టు, వాన, ప్రక తి మొ.న ప్రాథమిక వస్తువుల్ని దాటుకుని సమాజాన్ని చూసి విచారం వ్యక్తపరుస్తూ, ఎటుపోతదో ఈ దేశం? అనే మథనపడుతున్న స్థితిలోకి తనను తాను మోసుకు తిరగడం కవిగా తన బాధ్యతను మరింత స్థిరపరిచేలా చేస్తది.
లోకం అంటే లోకం ఒంటరిదే కదా? అందరూ కలిసి ఉండే రోజులు ఒకరి గురించి ఒకరు ఆలోచించే రోజులు ఎప్పుడస్తయో ఏమో ?
కవికి వాక్యం కవిత్వవాక్యంగా మలిచే నేర్పు అబ్బింది. విషయాన్ని నేరుగా చెప్పకుండా కళాత్మకంగా తీర్చిదిద్దాలన్న తలంపు కనిపిస్తది. ‘ పెనం మీద నీళ్లు ‘ అనే వ్యక్తీకరణ ‘ద్వారా ‘ప్రేమ’ ను వ్యక్తపరిచే ప్రయత్నం కనిపిస్తది. లోకంలో ప్రేమలన్నీ ఆవిరవుతున్న, కనుమరుగవుతున్న అంశాన్ని వాచ్యంగా ‘సంబోధన’ ద్వారా తెలియపర్చడం గమనించవచ్చు. ‘ఎత్తుగడ’ ‘కార్య కారణ సంబంధం (Cause and effect) ను సంతప్తి పరిచేదిగా అనిపిస్తది. అంటే ప్రేమలేని చోట బరువెక్కి భారమవుతున్న బంధాల్ని, చేదయి ముఖం తిప్పుకునే పలకరింపుల్ని, కులగోడలల్ల ఇరుక్కుపోయి యిబ్బంది పడే మనుషుల్ని చూపెడుతది.
ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానంగా వస్తు నిర్వహణ కొనసాగించబడుతది. అప్పటికే స్థిరపర్చుకున్న అభిప్రాయాలు, నమ్మకాలు, నిర్వచనాలు, సూత్రాలు ఏవైనా సత్యాలు కావనే, శాశ్వతం కావనే విషయాన్ని సమర్ధించేలా, మార్పుకు ఆస్కారం వుంటుందనే వాస్తవాన్ని గ్రహించాలనే ఎరుక కలిగిస్తది. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన మార్పులకు కారణాల్ని అన్వేషించి ఒక నిర్ధారణకు వచ్చి ‘అరచేతిలో ఇమిడి పోమే వస్తువు (Mobile) యొక్క తదుపరి పరిణామాల్ని ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ వ్యంగ్యాత్మకతను నింపుకున్న వాక్యాల్ని (ironic statement) ఆసరాగా చేసుకుని, లోకం వుండాల్సిన తీరును, దాని వాస్తవికతను ఆర్ద్రతతో చెప్పే ప్రయత్నం చేస్తడు. అందుకు తగిన స్టేట్ మెంట్ ను జతపరుస్తడు. పోలికలతో కొన్ని ఊహా ప్రతిపాదనల్ని ప్రవేశపెడుతడు. ముగింపుకు బలాన్ని చేకూర్చే విధంగా ఆశా వహ దక్పథాన్ని వ్యక్తపరిచే నిట్టార్పుల్ని బహిర్గతం చేస్తడు. ప్రపంచీకరణ ప్రభావంతో, ఆధునికీకరణ ప్రభావంతో అందివచ్చిన, అంది పుచ్చుకున్న సాంకేతిక విజ్ఞానం వల్ల మనుషులు కోల్పోతున్న ‘ప్రేమ’ను నొక్కిచెప్పడం పున:స్థాపనం (Restoration) చెందించాలనే బలమైన కోరికను ఈ కవిత ద్వారా కవి ఆశించినట్లు అర్థమైతది.
కవి వ్యక్తపరిచిన భావాలన్నీ సరళంగా, సూటిగా పాఠకులను చేరుకుంటయి. అభూత కల్పనలు, ఊహలు, ఏమీ లేకుండా వాక్యాన్ని కవిత్వం చేయడానికి ప్రయత్నించి సఫలం అయ్యాడని చెప్పవచ్చు. సమస్యను సరియైన మూలాధార చికిత్స చేయడం వలన సమాజం, లోకం బాగుపడుతుందనే సందేశాన్ని అందిస్తడు. వర్తమాన స్థితి గతులకు, విపరిణామాలకు ప్రతీకగా ‘లోకం ఒంటరైయ్యింది’ అనే వాస్తవాన్ని ‘శీర్షిక’గా ప్రకటిస్తడు.
– బండారి రాజ్ కుమార్, 8919556560



