”మనం చాలా ఒత్తిడితో కూడిన కాలంలో జీవిస్తున్నాం. మనందరి పైన బర్న్‌అవుట్ (burnout) ప్రభావం తీవ్రాతితీవ్రంగా ఉంది” అంటున్న మనస్తత్వవేత్త డా. ఆడమ్ బోర్లాండ్ నాకు ఈ మధ్య పదేపదే గుర్తుకొస్తున్నాడు. గుర్తుకురావడమే కాదు, విద్యార్థులు యువత ప్రతి ఒక్కరూ ఏదో ఒకమేర అలసట, అశాంతి, విసుగు, ఒత్తిడి, పనిభారంలో మగ్గిపోతున్న నేపథ్యంలో బర్న్‌అవుట్ ముప్పును విప్పిచెప్పమని ఓహియో లోని తన క్లివ్ లాండ్ క్లినిక్ నుండి సందేశం పంపిస్తున్నాడు. ప్రస్తుతం ఎనబై శాతానికి పైగా యువత ‘బర్న్‌అవుట్’ స్థితిలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా తన నివేదిక-2024లో వెల్లడించింది. వీళ్లంతా ప్రపంచానికి పనికొచ్చే 18-34 సంవత్సరాల మధ్యగల యువతీయువకులే కావడం ఆందోళన కలిగిస్తుందని WHO పేర్కొన్నది.
“Burnout as a syndrome with three dimensions: overwhelming exhaustion, cynicism/detachment, and a sense of ineffectiveness, stemming from chronic workplace stress’’
Christina Maslach &
Michael P. Leiter
విద్యార్థుల వరకే చూస్తే ప్రేరణ లోపించడం, ఉత్సాహంగా అభ్యసనంలో పాల్గొనలేకపోవడం, తరగతిగది కత్యాలల్లో సజనాత్మకత కనబరచలేకపోవడం, విద్యా సామర్థ్యాలపై విశ్వాసం కోల్పోవడం, లక్ష్యాల నుండి వైదొలగడం, తల గొంతు కండరాల నొప్పితో ఉద్రిక్తతకు అసహనానికి లోనవడం బర్న్‌అవుట్ స్టూడెంట్స్‌లో కనిపించే లక్షణాలు. సరళంగా చెప్పాల్సివస్తే భావోద్వేగ అలసట (Emotional exhaustion), శారీరక అలసట , అభిజ్ఞా అలసట (Cognitive fatigue) అనే మూడింటి సమాహారమే బర్న్‌అవుట్. ఈ పదాన్ని మొదట న్యూయార్క్‌కు చెందిన హెర్బర్ట్ ఫ్రూడెన్‌బర్గర్ 1970 లలో ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ‘ªBurnout: The High Cost of High Achievement అనే గ్రంథంలో బర్న్‌అవుట్ గురించి క్షుణంగా చర్చిస్తూ నిరంతర బర్నౌట్ కారణంగా విద్యార్థులు చదువుల్లోనే కాదు, జీవన నాణ్యతనూ కోల్పాతారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే బర్న్‌అవుట్‌ను మందులతో నయం చేయాల్సిన రుగ్మత అనే కంటే, అభ్యసనపరమైన, వత్తిపరమైన ఒక ప్రత్యేక విషమ దగ్విషయంగా సైకాలజిస్టులు ధ్రువీకరించారు. ఇప్పుడు తల్లిదండ్రులు యాజమాన్యాలు ఉపాధ్యాయులు స్కూల్ బర్న్‌అవుట్ లేదా అకడమిక్ బర్న్‌అవుట్ నుండి విద్యార్థులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీసెస్-11 గా బర్న్‌అవుట్ ను ధ్రువీకరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిలక్షణాలతోపాటు కారణాలను నివేదికలో పొందుపరచింది. వర్క్ ప్లేస్‌లో దీర్ఘకాలిక పనుల ఒత్తిడి మూలాన దాపురించే బర్న్‌అవుట్ సిండ్రోమ్ వ్యక్తుల ద్వారా సమాజం మీద అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని WHO చెప్పుకొచ్చింది. బర్న్‌అవుట్ లక్షణాలను పరిశీలించినట్లైతే శక్తి క్షీణత, అలసట, ఉద్యోగం పట్ల మానసిక దూరం, ప్రతికూలత, విరక్తి, వత్తిపరమైన సామర్థ్యం తగ్గడం, తిరోగమన దక్పథం వంటి నెగెటివ్ ప్రభావాలు వర్క్‌ప్లేస్‌లో వ్యక్తులు ఎదుర్కుంటున్నారని WHO స్పష్టం చేసింది. బర్న్‌అవుట్ అనేది అధిక, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కలిగే భావోద్వేగ, శారీరక మానసిక అలసటతో కూడిన మానసిక స్థితి. ఇది కేవలం ఒత్తిడి కాదు, కాలక్రమేణా మనసుమీద బురదలా పేరుకుపోయి, జీవితంలోని డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నట్లు అనిపించేంతగా వ్యక్తిని క్షీణింపజేసే పరిస్థితి. ఇది సాధారణంగా పనిలో, కార్యనిర్వహణా బాధ్యతల్లో లేదా ఇతర జీవిత రంగాలలో ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం వల్ల వస్తుంది. బర్న్‌అవుట్ సిండ్రోమ్ తాకిడిలో వ్యక్తుల ప్రవర్తనను ఎనమిది రకాలుగా నిపుణులు అభివర్ణించారు.
1. పని పట్ల విరక్తి, ఉత్సాహం లేకపోవడం (Cynicism and lack of motivation):
ఉద్యోగం పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. పనికి వెళ్లాలనే ఆలోచన ఆందోళన కలిగిస్తుంది, తమ బాధ్యతల నుండి దూరంగా ఉండాలని చూస్తారు.
2. ఒంటరితనం (Isolation):
స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగుల నుండి దూరంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, విందు ఆహ్వానాలను కష్టంగా భావించి నిరాకరిస్తారు.
3.పనులను వాయిదా వేయడం (Procrastination):
పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు లేదా పూర్తిగా వాయిదా వేస్తారు.
4.చిరాకు, కోపం(Irritability and anger):
చిన్న చిన్న విషయాలకే విపరీతంగా చిరాకు పడతారు, తరచుగా సహనం కోల్పోతారు. ఇతరులపై తమ అసహనాన్ని లేదా కోపాన్ని ప్రదర్శిస్తారు.
5.నిరాశావాదం మరియు ఆత్మ సందేహం (Pessimism and self-doubt):
ప్రతి విషయంలోనూ ప్రతికూలంగా ఆలోచిస్తారు. తమ సామర్థ్యంపై నమ్మకం కోల్పోయి, తమకు తాము అసమర్థులమని భావిస్తారు.
6.సమయపాలన సమస్యలు (Time management issues):
పనిని నిర్వహించడంలో సమయానికి పూర్తి చేయడంలో విఫలమవుతారు. తరచుగా పనికి ఆలస్యంగా రావడం లేదా పనినుండి త్వరగా వెళ్లిపోవడం వంటివి చేస్తారు.
7. అనారోగ్యకరమైన అలవాట్లకు బానిస కావడం (Unhealthy coping mechanisms):
ఒత్తిడిని తట్టుకోవడానికి మద్యం లేదా మాదకద్రవ్యాలను ఆశ్రయిస్తారు.
8.శారీరక లక్షణాలు (Physical symptoms):
తరచుగా తలనొప్పి, కడుపు సమస్యలు, కండరాల నొప్పులు వంటి శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. నిద్రించే విధానంలో అసాధారణ మార్పులు, నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం కూడా ఉంటాయి.
బర్నౌట్ పరిష్కరణ కోసం అమెరికా ఆరోగ్య శాస్త్రవేత్తలు ఎమిలీ నాగోస్కీ అమెల్లా నాగోస్కీ సిస్టర్స్ తమ పరిశోధన ఆధారంగా నలబై రెండు శాతం నియమాన్ని (42 Rule) ప్రతిపాదించారు. దీని ప్రకారం అధిక పనితీరు కనబరిచే వ్యక్తులు కనీసం నలబై రెండు శాతం సమయం విశ్రాంతిని తాము కోలుకోవడానికి వెచ్చించాల్సి ఉంటుంది. 42% అంటే వ్యక్తి శరీరం, మెదడు విశ్రాంతి తీసుకోవడానికి ఎంత సమయం అవసరమో అంత సమయం. ఇది ప్రతి 24 గంటలలో దాదాపు 10 గంటలు. ఎవళ్లకు వాళ్లు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే ఒత్తిడిని ఎదుర్కొని బర్న్‌అవుట్ ప్రమాదం నుండి బయటపడటమే కాకుండా వైయక్తిక శ్రేయస్సును సామార్థ్యాలను మెరుగుపరచుకోవచ్చుననేది నాగోస్కీ సిస్టర్స్ సలహా. ఇంగ్లాండ్‌లో కార్మికులు పనిగంటలు ముగిశాక కుటుంబం, స్నేహితులతో సమూహంతో గడపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) ను పాటించడం ద్వారా ఒత్తిడి నివారణలో ముందున్నారని బర్న్‌అవుట్ రిపోర్ట్ -2025 చెపుతుంది.Shawn Achor ”ది హ్యాపీనెస్ అడ్వాంటేజ్” పుస్తకంలో వివరించిన విధంగా దీరెకాలిక ఒత్తిడి మెదడును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, తద్వారా ఆనందం, స్థితిస్థాపకత (resilience)ను అనుభవించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అభిజ్ఞా పనితీరును (cognitive
performance) ఒత్తిడి ఎట్లా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం దగ్గరనే బర్న్‌అవుట్ (burnout) నుండి విముక్తి ఆరంభమవుతుంది. బర్న్‌అవుట్ క్రీనీడల నుండి ముఖ్యంగా బంగారు భవిష్యత్తున్న విద్యార్థుల్ని యువతను కాపాడవలసిందిగా గురువులందరికి నా వినమ్ర పూర్వక మనవి.
– డా.బెల్లి యాదయ్య, 9848392690



