Wednesday, January 7, 2026
E-PAPER
Homeసోపతిఒక్క ఆలోచన జీవితాన్ని మారుస్తుంది..!

ఒక్క ఆలోచన జీవితాన్ని మారుస్తుంది..!

- Advertisement -

”Man is the measure of all things’ అంటాడు ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త ప్రోటా గోరస్‌. మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా నేను మాత్రం పై స్టేట్మెంట్‌తో ఏకీభవిస్తాను. అవును మానవుడే అన్ని విషయాలకు కొలమానం లాంటివాడు, కేంద్ర బిందువు కూడా. ఒక వస్తువు ఉందా లేదా, వుంటే దాని పనితీరు ఎలా వుంది అని పరిశీలించి పరిశోధించి అనుభూతి చెందే వ్యక్తే మనిషి. అంటే ప్రతి వ్యక్తి తనకు తానుగా కొలమానం లాంటివాడే. ఈరోజు కనిపించే భౌతికమైన మార్పు రేపు ఇంకొక రకంగా ఉండొచ్చు. కారణం పరిశోధనల ఫలితం కావొచ్చు, లేదా ప్రాకతికమైన మార్పుల వల్ల జరిగి ఉండొచ్చు. అందుకే మనిషి సమూహంలో వున్నా ఒంటరిగా ఫీలవుతాడు. ఒంటరితనంతో వున్నా సమూహంలో వున్నట్లుగా భ్రమిస్తాడు. నేడు మనం అనుభవిస్తున్న, అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తున్న పరిజ్ఞానమంతా మనిషి మెదడులో వచ్చిన మార్పుల ఫలితంగా (మేథో వికాసం) చూస్తున్నదే. అందుకే ఒక్క ఆలోచన మనిషి జీవితాన్ని మారుస్తుందని బలంగా చెప్పగలను అది ఎలాగో ఈ కథ చదవండి.

ఒక కుమ్మరివాడు మట్టితో పొయ్యిని తయారు చేయాలని మట్టిని మెత్తగా తొక్కి, చేతులోకి తీసుకుంటాడు. ఇంతలో అతడి భార్య వచ్చి ఏం చేస్తున్నారు? అంటుంది. కుమ్మరివాడు ప్రేమగా అతడి భార్యకు పొయ్యి తయారు చేస్తున్నాను. ఈ మధ్యలో వీటికి ఎక్కువగా డిమాండ్‌ పెరిగింది అంటాడు. దానికి అతని భార్య పొయ్యి వద్దు కూజా తయారు చేయి. వచ్చేది వేసవి కాలం చల్లని నీటి కోసి చాలామంది కొంటారు అంటుంది. ఆ మాటలు విన్న కుమ్మరి ఆలోచనలోపడి సరేనంటాడు. కుండలు తయారు చేయాలని మట్టిని ఇంకాస్త మెత్తగా చేస్తూ సారే తిప్పుతుంటాడు. అప్పుడు ఆ మట్టిలో నుండి మాటలు ఇలా వినిపిస్తాయి… ”మిత్రమా ఏం చేసున్నావ్‌ మొదలు ఒక రూపం ఇవ్వాలని అనుకున్నావ్‌? ఇప్పుడు మరొక రూపం ఇవ్వాలనుకుంటున్నావ్‌?”
దానికి కుమ్మరివాడు నా ఆలోచన మారింది అంటాడు. దానికి మట్టి, నీ ఆలోచన వల్ల నా జీవితమే మారిపోతుంది.
నువ్వు పోయ్యి చేస్తే ఎప్పుడు నిప్పుతో సహవాసం చేయాల్సి వచ్చేది. మారిన నీ ఆలోచన వల్ల చల్లని నీటితో చాలామందికి దాహం తీర్చే అవకాశం ఇచ్చావు అంటుంది.

చూశారా మిత్రులారా ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేసింది. ఆలోచించండి. వాల్ట్‌ డిస్నీ ఇంట్లో కూర్చోని కాఫీ తాగి కప్పును టేబుల్‌ పైన పెట్టగా ఓ ఎలుక వచ్చి కాఫీ కప్పును రుచి చూసి వెళ్ళిదాక్కోవటం, తిరిగి మళ్ళీ వచ్చి రుచి చూడటం చూసి నవ్వుకుంటాడు. ఆ చిన్న ఎలుక తనకే ఇంతలా నవ్వుకోవడానికి కారణం అయితే ఇంకా చాలామందిని నవ్విస్తుందని భావించాడు. దాని ఫలితమే ‘మిక్కీ మౌజ్‌’. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే కార్టూన్‌.
అలాగే అంగుళీ మాలుడనే క్రూర స్వభావం వున్న వ్యక్తి తొమ్మిది వందల తొంబై తొమ్మిది (999) మంది బొటనవేళ్ళను నరికి తన మెడలో వేసుకొని ఆనందం పొందుతూ మిగిలిన ఒక్కరి బొటనవేలు నరికి తన మెడలో వేసుకుంటే తన కోరిక నెరవేరుతుందని ఒక్క వ్యక్తి కోసం ఊరి బయట కొండపై ఉండేవాడు (చివరికి తల్లిదైన సరే) ఊరంతా ఆ పరిసరాలలోకి వెళ్ళడానికి బయపడే వారు. రాజు కూడా ఆ పరిసరాలలోకి ఎవరూ వెళ్ళవద్దని హెచ్చరిక బోర్డు పెట్టిస్తాడు. కానీ బిక్షాటనలో భాగంగా గౌతమ బుద్ధుడు ఆ మార్గం గుండా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. దానికి అతడి శిష్యులు ఆ మార్గంలో అంగుళీమాలుడనే రాక్షసుడు కొండపై నివసిస్తాడని, మనం అటుగా వెళ్తే మనల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తాడని, ఆ దారి గుండా వద్దని బుద్దుడిని వేడుకుంటారు. ఐనా వారి మాటలు వినకుండా బుద్ధుడు ఆ దారిగుండానే వెళ్తాడు. దూరంగా వస్తున్న బుద్ధుడిని గమనించిన అంగుళీమాలుడు ఆ వచ్చే వ్యక్తి బొటనవేలు కోసి నా కోరిక పూర్తి చేసుకుంటాను అని ఆనందపడుతుంటాడు.

వడివడిగా నడుస్తూ సమీపించిన బుద్ధుడి మొఖంలో తేజస్సు, చురుకుదనం చూసి అంగుళీమాలుడి చేతులు వణకడం మొదలౌతాయి. సమీపంగా వస్తున్న బుద్ధుడిని ఆపే ప్రయత్నంలో ‘కదలకుండా అక్కడే నిలబడు సన్యాసి. నేను నీ బొటన వేళు కత్తిరిస్తాను. ఈ రోజుతో నా శపథం (వెయ్యి బొటన వేళ్ళు) పూర్తవుతుంద’ని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంగులీమాలుడితో ‘మూర్ఖుడా నేను నిలబడే వున్నాను. కానీ ఒక్క క్షణం ఆలోచించు. నేను కూడా క్షత్రీయుడినే. సన్యాసం తీసుకోకపోయి వుంటే నేను నిన్ను సంహరించే వాడిని. ఇక మీదట నువ్వు నీ ఆలోచనలను మార్చుకో. నీ శపథం వల్ల చాలామంది ప్రాణాలుపోయాయి. దానివల్ల నువ్వు సాధించినది ఏమిటి? నువ్వు అనుకున్నట్లుగా మనిషి శరీరంలో ఒక భాగం తొలగించటం చాలా తేలిక కానీ దానిని తిరిగి అతికించటం చాల కష్టం. రెండింట్లో ఏది మంచిదో ఆలోచించుకో’ అంటాడు బుద్దుడు.
అలాగే అంగుళీమాలుడికి ఓ చిన్న పరీక్ష పెడతాడు. పక్కన వున్న చెట్టుని తన దగ్గర వున్న ఖడ్గంతో ఛేదించమని చెప్తాడు. అంగుళీమాలుడు ఖడ్గంతో చెట్టును రెండుగా ఛేదించిన తర్వాత బుద్దుడు అంగుళీమాలుడితో వేరైన రెండు శాఖలను తిరిగి జోడించు అంటాడు. అప్పుడు అంగుళీమాలుడు ఆలోచనలో పడుతాడు.
మిత్రమా అంగుళీమాలా… ఛేదించటం సులభమైన పని అతికించటం చాలా క్లిష్టతరమైనది. ఇక మీదట ఎప్పుడు ఇలా చేయవద్దు అంటాడు. ఆ మాటలు విన్న అంగుళీమాలుడు బుద్ధుడి కాళ్ళు పట్టుకొని తన వల్ల జరిగిన అపరాధానికి క్షమించమని వేడుకుంటాడు. ఆ క్షణం నుండే అంగుళీమాలుడు బౌద్ధం స్వీకరించి బుద్ధుడి ప్రియ శిష్యులలో ఒకడిగా మారుతాడు.

ఇది ఒక అంగుళీమలుడి ఆలోచనలకే పరిమితం కాని కథ. మన జీవితంలో మన కళ్ళముందే ఇలా చాలామంది తమ తమ జీవితాల్లో చెడు అలవాట్లకు బానిసలై ఇతరుల జీవితాలను విషాదంలోకి నెడుతూ వుంటారు. అందుకే ఏదైనా చేయడానికి ముందు ఆలోచించండి. ఎవరికీ హానిచేయని పని ఐతే చేయండి. కానీ ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేసే పనిని చేయడానికి సంకోచించండి. దానివల్ల మీకు కూడా చివరికి హాని జరిగే అవకాశం వుంటుంది. చివరికి అంగుళీమాలుడు తనవల్ల జరిగిన తప్పిదం తెల్సుకొని బౌద్ద బిక్షవుగా మారి ఎవరికైతే హాని తలపెట్టాడో ఆ కుటుంబంలోని వ్యక్తుల వద్దకే బిక్షకు వెళ్తాడు.
ప్రారంభంలో అంగుళీమాలుడు భిక్ష కోసం వెళ్తే జనాలు రాళ్ళతో కొట్టేవారు. ఐనా అంగుళీమాలుడు భరించి బుద్ధుడి వద్దకు వచ్చేవాడు. జరిగిన విషయం చెప్పి బాధపడేవాడు. దానికి బుద్ధుడు నవ్వి ఈరోజు నీకు ఎలాంటి బాధ కల్గుతుందో, వారి కుటుంబాలు కూడా నీ వల్ల అలాంటి బాధలే వారు అనుభవించారు. కాబట్టి కాస్త ఓపికపట్టు అన్ని సర్దుకుంటాయి అంటాడు.
వారు కొట్టిన దెబ్బలు శరీరానికి తగిలాయి. కాని నీ మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా హింసకు దూరంగా వుంది. కాబట్టి వారే క్రమక్రమంగా నిన్ను బాధపెట్టడం మానుకుంటారు అంటాడు. ఆ మాటలు విన్న అంగుళీమాలుడు బోరున విలపిస్తాడు. ఎవరైనా ఆలోచిస్తారా తొమ్మిది వందల తొంబై తొమ్మిది మంది బొటనవేళ్ళు కత్తిరించి మెడలో వేసుకున్నవాడు సన్యాసిగా మారుతాడని? నమ్మగలమా ఆలోచించండి? అందుకే ఆలోచనలు మారితే జీవితం మారుతుంది కాదంటారా?

– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -