స్త్రీ ఉనికిలోకి
వచ్చినప్పట్నుంచి
ఇప్పటి వరకు
అన్ని రకాల
జాతి మత వర్ణాల
మహిళల బాహ్య
అంతర శరీరాంగాలలో
ఏలాంటి మార్పులుగాని
నరాలలో ప్రవహిస్తున్న
రుధిర వర్ణంగాని
అవకతవకలు లేనివిగా చూశాను
అవును, నేను ముసలిదాన్ని
పండు వృద్ధురాలిని
మీ దృష్టిలో పిచ్చిదాన్ని.
శతాబ్దాలు వెళ్లదీసిన
వృద్ధ వృక్షాలు
నూతన ఎత్తైన బహు అంతస్థుల
ఆధునిక సాంకేతాలతో
నిర్మించబడిన ఎన్నో
భవనాల ముందు
మరుగుజ్జులా అగుపిస్తూన్నవిగా
చూస్తున్నాను, అవును
నేను ముసలిదాన్ని
మీ దృష్టిలో పిచ్చిదాన్ని.
పట్టణ తోడేళ్ళు
అడవిలోని పులిలా
గర్జించడం విన్నాను
పిరికి న్యాయం
కంబళిలో జొరబడి
గురకలు వేయడం చూశాను
అవును, నేను పిచ్చిదాన్ని
ముసలిదాన్ని!
మూర్ఖులను ఉన్నత పదవులపై
విరాజిల్లిన వారిని చూశాను
దేశాన్ని ఎంతో వేగంగా
అభివృద్ధి చేస్తూ
శరవేగంతో దూసుకెళుతున్నామని
ప్రగల్భాలు ప్రేలిన
రాజకీయుల రాజరీకం చూశాను
అవును, నేను పిచ్చిదాన్నే
అక్షర జ్ఞానం ఉన్న ముసలిదాన్నే!
అమ్జద్, 965 507662638



