ట్యాంక్ బండ్‌పై ఫూలే దంపతుల విగ్రహాలు
క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
రవీంద్రభారతిలో సావిత్రిబాయి 195వ జయంతి కార్యక్రమం
నవతెలంగాణ-కల్చరల్
దేశ తొలి మహిళా సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని, ఆమె జీవితం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకమని పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్, సావిత్రిబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ, సావిత్రిబాయి మహిళా సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సావిత్రిబాయి 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుతో కలిసి మంత్రి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సావిత్రిబాయి భర్త ప్రోత్సాహంతో చదువుకుని, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆమె ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఫూలే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నేడు వ్యవసాయ మార్కెట్లు చేయలేని పనులను మహిళలు చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలు చట్ట సభల్లో 33 శాతం ప్రజా ప్రతినిధులుగా ఉంటారని చెప్పారు.చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే అని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా ఫూలే దంపతులు నిరంతరం పోరాటం చేశారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. సావిత్రిబాయి జయంతి రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అంబర్‌పేట్‌లో జ్యోతిరావు ఫూలే ఆడిటోరియం నిర్మించాలని కోరారు. ప్రతి జిల్లాలో సావిత్రిబాయి ఫూలే ప్రతిభా పాటవ పోటీలతోపాటు విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు. మహిళా సంఘాలకు అండగా నిలబడి తక్కువ వడ్డీలకు రుణాలు అందించాలన్నారు.
కార్యక్రమంలో గందరగోళం
సావిత్రిబాయి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్, సావిత్రిబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీకి రూ.10లక్షలు కేటాయించింది. ఇరు సంస్థలు సమన్వయంతో వేడుకలు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రెండు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకే వేదికపై వేర్వేరుగా సభా కార్యక్రమాన్ని నిర్వహించడం గందరగోళానికి దారితీసింది. ప్రజా ప్రతినిధులు వేదికపై ఉన్న సమయంలో మాట్లాడటానికి మైక్ కోసం ఒకరికొకరికి వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సమన్వయ లోపంతో సభకు వచ్చినవారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయలేదు. విద్యార్థులకు మధ్యాహ్నం మూడు గంటల వరకు భోజనం లేకపోవడంతో ఆకలితో అలమటించారు.



