– ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెకు మద్దతు : ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా
విశాఖ కలెక్టరేట్ : బీమా రంగంలో ఎఫ్‌డీఐని వంద శాతం పెంచడం పూర్తిగా ప్రజావ్యతిరేక చర్య అని, ఇది దేశీయ పొదుపు డబ్బును విదేశాలకు తరలించడానికి దారితీస్తుందని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నారు. భువనేశ్వర్‌లో ఇటీవల ఐదు రోజులపాటు జరిగిన ఏఐఐఈఏ ప్లాటినం జూబ్లీ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను తెలియజేయడం కోసం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ఉద్యోగుల సమావేశం డివిజన్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఇందులో ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీకాంత్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వరంగ బీమా పరిశ్రమ, భారతదేశంలోని శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను భువనేశ్వర్ సమావేశం సమీక్షించినట్టు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరిచే లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై జనరల్ కౌన్సిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ బీమా పరిశ్రమ రక్షణ, బలోపేతం కోసం దేశవ్యాప్తంగా ప్రచారాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు తమ పూర్తి మద్దతు తెలిపామన్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పీఎస్‌జీఐ ఉద్యోగులు ఈ నెల 9న చేపట్టనున్న ప్రతిపాదిత సమ్మెకు బలమైన సంఘీభావం తెలియజేస్తున్నట్టు చెప్పారు. భువనేశ్వర్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్షునిగా ధర్మరాజ్ మహాపాత్ర, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ మిశ్రా, కోశాధికారిగా బీఎస్ రవి ఎన్నికైనట్టు చెప్పారు. ఐసీఈయూ అధ్యక్షులు ఎం కామేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి వరప్రసాద్, మహిళా కన్వీనర్ జి సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.
బీమా’ వంద శాతం ఎఫ్‌డీఐ ప్రజా వ్యతిరేకం
- Advertisement -
- Advertisement -



