Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు

ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు

- Advertisement -

కార్పొరేట్‌ పాలసీతో కార్మికవర్గానికి తీవ్ర నష్టం
ఆర్థిక దాడితో పేదలకు విద్య, వైద్యం, ఉపాధిపై తీవ్ర ప్రభావం
భవిష్యత్‌ పోరాటాలకు దేశవ్యాప్తంగా చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌
సీఐటీయూ అఖిల భారత కార్యవర్గ సభ్యులు సీహెచ్‌.నర్సింగరావు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఏవీ.నాగేశ్వరరావు
నేడు ర్యాలీ, బహిరంగ సభ : ఆర్‌కేఎస్‌వీ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ పాలసీతో కార్మికవర్గానికి తీవ్ర నష్టం కలుగుతున్నదనీ, కార్మికులు, రైతులు, ఇతర తరగతులపై ఆర్థిక దాడి తీవ్రమై వారికి విద్య, ఉపాధి, వైద్యం పొందలేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని సీఐటీయూ అఖిల భారత కార్యవర్గ సభ్యులు సీహెచ్‌.నర్సింగరావు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఏవీ. నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రకటించారు. శనివారం విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లోని మహాసభల ప్రాంగణంలో సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. దేశంలో కార్మికులపై పెరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు, కార్మికుల సమస్యలపై పోరాడేందుకు 9 గంటల పాటు జరిగిన చర్చలో 55 మంది ప్రతినిధులు సుధీర్ఘంగా చర్చించారనీ, ప్రత్యామ్నాయ విధానంపై 52 మంది ప్రతినిధులు 9 గంటల పాటు చర్చించారని తెలిపారు. కేరళలో హిందూస్తాన్‌ పేపర్‌ మిల్లును ప్రయివేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరిగాదంటూ కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఆ మిల్లును టేకోవర్‌ చేసిందనీ, కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఆ మిల్లును నడిపిస్తోందని వివరించారు. కోర్టులో కేసు వేసి ఎయిర్‌పోర్టును ప్రయివేటీకరించకుండా కేరళ వామపక్ష ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. కార్పొరేట్‌ వ్యతిరేక, ప్రజానుకూల విధానాల కోసమే సీఐటీయూ పోరాడుతోందన్నారు. మన దేశంలో ప్రయివేటు పేరుతో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను సామాన్యులకు అందకుండా చేసే విధానంపై సీఐటీయూ నికరంగా పోరాడుతున్నదని చెప్పారు. రాబోయే కాలంలో ప్రతి రంగానికి సంబంధించిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను తయారు చేసి ముందుకెళ్తామని ప్రకటించారు.

నేడు భారీ ర్యాలీ, బహిరంగ సభ : ఆర్‌కేఎస్‌వి కుమార్‌
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నగరంలోని ఎన్‌ఐసీ అంబేద్కర్‌ భవనం నుంచి డాబాగార్డెన్స్‌, జగదాంబ సెంటర్‌ మీదుగా ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం వరకు భారీ కార్మిక ప్రదర్శన ఉంటుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ తెలిపారు. ర్యాలీ అనంతరం మున్సిపల్‌ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. బహిరంగ సభలో సీఐటీయూ అఖిల భారత నాయకులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -