పచ్చి మామిడికాయలు దొరికే సీజన్ ఇది. మరి కొద్ది రోజులు పోతే అవి దొరకడం కష్టం. అందుకే చాలా మంది వీటితో రకరకాల వంటకాలు చేసుకుంటారు. అలాగే పచ్చి మామిడి కట్ చేసుకొని కాస్త ఉప్పు కారం వేసుకొని తింటే, ఆహా అంటారు అందరూ! పచ్చి మామిడి కేవలం రుచికి మాత్రమే కాదు, ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి విటమిన్ సి అందుతుంది. అలాంటి పచ్చి మామిడితో చేసే కొన్ని రకాల రెసిపీల గురించి తెలుసుకుందాం…
పకోడీలు
కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ – ఒకటి, శనగపిండి – కప్పు, కారం – అర స్పూను(రుచికి తగినంత), పసుపు – చిటికెడు, జీలకర్ర – టీస్పూను, కొత్తిమీర తరుగు – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: దీనికోసం ముందుగా తాజా పచ్చిమామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి పీలర్ సహాయంతో పై చెక్కు తీసుకోవాలి. తర్వాత చాలా సన్నగా తురుముకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పచ్చిమామిడి తురుము, శనగపిండి, జీలకర్ర, కారం, పసుపు, కొత్తిమీర తరగు, ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దికొద్దిగా నీరు చల్లుకుంటూ పకోడీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ పకోడీల్లా కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. వెంటనే కదపకుండా కాసేపు ఆగి తర్వాత జాలి గరిటెతో అటు ఇటు అనుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పకోడీని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. నోరూరించే కమ్మని ‘మామిడికాయ పకోడీ’ రెడీ! వీటిని వేడి వేడిగా టమాటా సాస్ లేదా కొత్తిమీర చట్నీతో అద్దుకొని తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
పచ్చిమామిడి పచ్చిమిర్చి పచ్చడి
కావాల్సిన పదార్థాలు: పల్లీలు – అరకప్పు, పచ్చిమిర్చి – పదిహేను, పచ్చిమామిడి ముక్కలు – వంద గ్రాములు, ఉప్పు – రుచికి సరిపడా.
తాలింపు కోసం: నూనె – టేబుల్ స్పూను, ఆవాలు – అరటీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, ఎండుమిర్చి – ఒకటి, కరివేపాకు – ఒక రెమ్మ.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో పల్లీలు తీసుకొని శుభ్రంగా కడిగి, తగినన్ని నీరు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. అవి నానేలోపు మామిడికాయను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తుంపుకొని పక్కనుంచాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పల్లీలను నీటిని వడకట్టి వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడి ముక్కలు, ఉప్పు వేసుకోవాలి. కారానికి తగినట్టు ఉప్పు, పచ్చిమామిడి ముక్కలు అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీరు పోసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆపై మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపును మంచిగా వేయించుకోవాలి. స్టౌ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి చక్కగా కలుపుకోవాలి.
పచ్చిపులుసు
కావల్సిన పదార్థాలు: మామిడికాయ – ఒకటి, తరిగిన ఉల్లిగడ్డ – ఒకటి, బెల్లం తురుము – కొద్దిగా, వెల్లులి రెబ్బలు – నాలుగు, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – రెండు, ఉప్పు, కారం – తగినంత, పసుపు – చిటికెడు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు, ఆవాలు, జీలకర్ర – టీస్పూను.
తయారీ విధానం: ఎండుమిర్చి, వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయను చెక్కు తీసి ఉడికించి గుజ్జులా చేసుకోవాలి. దీంట్లో కొన్ని నీళ్లు పోయాలి. ఇందులోని పచ్చిఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు, వెల్లుల్లి ఎండుమిర్చి కారం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, ఎండు మిర్చి, వెల్లుల్లి కారం వేసి తాలింపు పెట్టాలి. దీన్ని పచ్చిపులుసులో కలపాలిగానీ పచ్చి పులుసు వేడిచేయకూడదు.
మామిడి నిల్వ పచ్చడి
కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు – మూడు కిలోలు, ఆవాలు – 60 గ్రా||, మెంతులు – 60 గ్రా||, కారం – 60 గ్రా||, సోంపు – 60 గ్రా||, పసుపు – 60 గ్రా||, ఉప్పు – 300 గ్రా||, నల్ల జీలకర్ర – 15గ్రా||, ఆవనూనె – తొమ్మిది కప్పులు.
తయారీ విధానం: మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత కాయలను సగానికి కట్ చేసి అందులో ఉండే జీడిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని శుభ్రమైన వస్త్రం మీద నాలుగు గంటల పాటు తేమ లేకుండా ఆరబోయాలి. ఆలోపు పచ్చడిలోకి కావాల్సిన ఇతర పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. అంటే ఆవాలు, సోంపు, మెంతులు, నల్ల జీలకర్రలను కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఆవనూనెను పొగ వచ్చేదాకా కాగబెట్టి, ఆపై దింపి చల్లార్చుకోవాలి. ఆవనూనెను వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆరబెట్టిన మామిడి ముక్కలు, గ్రైండ్ చేసుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. అదంతా మామిడి ముక్కలకు పట్టేలా బాగా కలిపి తడి లేని జాడీలోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటి పైన కాచి, చల్లార్చిన నూనె పోసి కలిపి మూత పెట్టి వస్త్రం చుట్టాలి. ఆ జాడీని నాలుగు రోజులు బాగా ఎండ తగిలేచోట ఉంచాలి. అంతే ఏడాది నిల్వ ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది.
మామిడికాయ పులిహోర
కావలసిన పదార్థాలు: బియ్యం – 300 గ్రాములు, మామిడికాయ తురుము – 1 కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు – 1/4 కప్పు, ఆవాలు – 1 టీ స్పూన్, మినప్పప్పు – 2 టీ స్పూన్లు, జీలకర్ర – 1 టీ స్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి – 3-4 (రుచికి సరిపడా), పసుపు – 1/2 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – కొద్దిగా (అలంకరణ కోసం). తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి, అన్నం వండుకుని పెట్టుకోండి. ఆ అన్నానికి కొంచెం పసుపు, ఒక స్పూన్ నూనె పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి, అందులో పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించండి. తరువాత పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించండి. ఇప్పుడు మామిడికాయ తురుము, ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని పసుపు, నూనె కలిపిన అన్నంలో వేసి బాగా కలపండి. చివరగా కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడిగా సర్వ్ చేయండి.
పచ్చిమామిడితో రుచిగా..
- Advertisement -
- Advertisement -