నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలుపై అదనపు ట్యాక్స్ విధించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీ సెస్ ను వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇకపై మన రాష్ట్రంలోనూ ఈ పన్ను వసూలు చేస్తామని ఆయన అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కొత్త ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్లకు రూ.5 వేలు, లారీల (హెవీ వెహికల్స్)కు రూ.10 వేల చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ సెస్ విధిస్తున్నామని, ఇది కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే, ఈ పన్ను నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.



