నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబెర్స్ కు ఆయన హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా విరోచిత పోరాటం చేసిన ఓటమీ చెందిన నాయకులను కలిసి, రానున్నది మన ప్రభుత్వమే అని భరోసానిచ్చారు.
అంతకుముందు మండలంలోని హెచ్ కేలూర్ లో గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింలు గౌడ్, ఆ గ్రామ పార్టీ అధ్యక్షులు గంగుల మారుతి నాయకత్వంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి పండరీతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందిన పలువురు దాదాపు 40 మంది షిండే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలంతో ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్, ప్రధాన కార్యదర్శి వై గోవింద్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.



