Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంనేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

- Advertisement -

– 4.13 లక్షల మంది దరఖాస్తు
– 892 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో గురువారం నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల నియంత్రణ అధికారి (సీవోఈ) జయప్రదబాయి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 2,36,915 మంది అబ్బాయిలు, 1,76,681 మంది అమ్మాయిలు, ఇతరులు ఒకరు చొప్పున మొత్తం 4,13,597 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఇందులో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగం నుంచి 2,49,204 మంది, ఒకేషనల్‌ నుంచి 17,003 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగం నుంచి 1,34,988 మంది, ఒకేషనల్‌ నుంచి 12,402 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. వారి కోసం 892 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గురువారం నుంచి జరిగే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా తేవాలని సూచించారు. మాల్‌ ప్రాక్టీస్‌ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మొబైల్‌ఫోన్లు, గడియారాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తేవడం నిషేధమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -