18 డిగ్రీల పైబడి ఉంటేనే అనుకూల వాతావరణం
ఉదయం మంచుతో అపార నష్టం
వరుసగా రెండేండ్లుగా ఇదే పరిస్థితి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
రైతుల పరిస్థితి గొడదెబ్బ చెంపదెబ్బ అన్న చందంగా మారింది. ఖరీఫ్‌లో ఆహార, వాణిజ్య పంటల సాగులో అధిక వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న పంటలు 10 శాతం కూడా చేతికి రాలేదు. ఖరీఫ్‌లో నష్టపోయినా ఉద్యాన పంటలైనా ఆదుకుంటాయనుకుంటే రైతులకు నిరాశే మిగులుతున్నది. అందులో మామిడి తోటల పరిస్థితి దారుణంగా ఉంది. వరుసగా రెండేండ్ల నుంచి మామిడి తోటలకు పూత లేక మామిడి కాయలు దిగుబడి కావడం లేదు. పొడి వాతావరణం తగ్గడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తామర పురుగు, బూడిద తెగులు మామిడి రైతులను కుంగదీస్తున్నాయి. ఈ ఏడాదీ అదే పరిస్థితి ఉండటంతో మామిడి సాగు ఎలా ఉంటుందోనని రైతులకు దిగులు పట్టుకుంది. తెల్లవారుజామున కురిసే మంచు మామిడి పూతపై పడి అనేక తెగుళ్లు వస్తున్నాయి.
డిసెంబర్ మాసంలోనే మామిడి పూత వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.89 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 10.50 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని ఉద్యానవన శాఖ ఆశించింది. ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉండటంతో దిగుబడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ మార్పులే ఇందుకు కారణం. చలితోపాటు పొగమంచు పూతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక అంటు మామిడి తోటలు ఉన్నాయి. వీటికి సహజంగానే తెగుళ్లు అధికంగా వ్యాపిస్తాయి. ప్రతికూల వాతావరణంలో బేనేషాన్, దసేరీ, మల్గుభా వంటి తోటలు తెగుళ్లను తట్టుకోలేవు. ఉదయం, సాయం కాలం 16 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటేనే ఆశించిన స్థాయిలో పూత నిలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడమేగాక 20 రోజులుగా రాత్రిపూట దట్టమైన మంచు కురుస్తోంది. పూత సమయంలో మంచు కురిస్తే.. తామర, బూడిద, తేనె మంచు, రసం పీల్చే పురుగు ఉధృతి పెరుగుతుంది. ఉద్యానవన అధికారులు సూచించిన మందులు వాడినా ప్రయోజనం ఉండటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు పూత తర్వాత జొన్న గింజల సైజులో కాయలు వస్తున్న సమయంలో వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు రైతులు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మామిడి తోటలను అత్యధికంగా సాగు చేస్తారు. 26,238 ఎకరాల్లో 8,298 మంది రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ పరిధిలో బేనేషాన్, తోతాపరి, జొన్నల రాసి, దసేరి వంటి పంటలను సాగు చేశారు. కొల్లాపూర్ పరిధిలో వీపనగండ్ల, పాన్‌గల్, పెంట్లవెల్లి, చిన్నంబావి, పెద్దకొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 16 వేల ఎకరాల మామిడి తోటలున్నాయి. అయితే, ఈసారి ప్రతికూల వాతావరణం వల్ల పూత కాతపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనపర్తి జిల్లాలో 11,793 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 11,080 ఎకరాలు, గద్వాల జిల్లాలో 4930 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 3303 ఎకరాల మామిడి తోటలున్నాయి. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మామిడి సాగు విస్తృతంగా ఉంది. డిసెంబర్ నెలలోనే 80శాతం పూత రావాలి.
రైతులకు అవగహన కల్పించాలి
నాగర్‌కర్నూల్ జిల్లాలో మామిడి సాగు అత్యధికంగా ఉంటుంది. 30 వేల ఎకరాలకు పైగానే మామిడి సాగు చేశారు. అందులోనూ కౌలు రైతులే అధికంగా ఉన్నారు. వీరికి ఉద్యానవన శాఖ వారు మంచు, బూడిద తెగుళ్ల నుంచి తోటలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలి. నష్టాల నుంచి కౌలు రైతులను గట్టెక్కించాలి.
శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్ జిల్లా
పూత నిలిస్తేనే కాత
మామిడిలో పూత నిలిచే సమయంలోనే దట్టమైన మంచు కురుస్తోంది. ఈ మంచు వల్ల పూతలో తేనెలాగా జుగుట వస్తోంది. దీంతో తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తాయి. బూడిద, తామర తెగుళ్ల వల్ల పూత రాలుతోంది. దాంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం కష్టంగా ఉందని రైతులు అంటున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు తీసుకొని రసాయనిక మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మయ్య తన మూడెకరాల్లో మామిడి సాగు చేశారు.
పూత దశలో మంచు, బూడిద తెగులు వచ్చి తోట అంతా బూడిద లాగా మారింది. ఈ ఏడాది తోట నిర్వహణకు ఎకరాకు లక్ష వరకు ఖర్చు చేశామని రైతులు అంటున్నారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన రాములు ఐదెకరాల తోటను ఏడాది కాలానికి 2.50 లక్షలకు లీజుకు తీసుకున్నారు. మరో 1.50 లక్షలు పురుగు మందులు, ఎరువులు, కూలీల ఖర్చు అయ్యింది. ఇప్పుడు మంచు వల్ల పూత రాలుతోంది. కాత నిలిచే అవకాలు తక్కువ. పూత సమయంలో ఉద్యానవనం, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు మంచుతోపాటు పూతకు సోకే తెగుళ్ల నుంచి ఎలా కాపాడుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.



